హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ దూకుడు కొనసాగుతున్నది. దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేస్తూ రియల్ పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారుతున్నది. కరోనా సమయంలోనూ ఇతర మెట్రో నగరాల కంటే ధీటుగా వృద్ధిని నమోదు చేసిన హైదరాబాద్… ఈ ఏడాది మూడో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్ లేదా క్యూ3)లోనూ తన జోరును కొనసాగించింది. ఇండ్ల అమ్మకాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే ముందు వరుసలో నిలిచింది. ఏకంగా 372 శాతం వృద్ధిని కనబర్చింది. అటు ఆఫీస్ స్పేస్ అమ్మకాల్లోనూ దేశంలోని మెట్రో నగరాల్లో రెండో స్థానంలో హైదరాబాద్ ఉండటం మరో విశేషం. ఈ మేరకు నైట్‌ఫ్రాంక్ ఇండియా 2021-క్యూ3 నివేదికను సోమవారం విడుదల చేసింది.
ఆఫీస్ స్పేస్‌లోనూ రికార్డులు
కేవలం ఇండ్ల అమ్మకాల్లోనే కాకుండా ఆఫీస్ స్పేస్ విభాగంలోనూ హైదరాబాద్ రియల్టీ ఆకర్షణీయ వృద్ధిని నమోదు చేసింది. మూడో త్రైమాసికంలో 21 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అమ్మకాలు జరిపి… దేశంలోని మెట్రోల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ మూడు నెలల్లో 2.20 లక్షల చదరపు అడుగుల స్పేస్ అందుబాటులో ఉన్నది. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు అంటే గడిచిన 9 నెలల్లో హైదరాబాద్‌లో 37 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రాగా.. ఇందులో 33 లక్షల చ.అ. మేర అమ్మకాలు జరిగాయి. కరోనా విపత్తు తర్వాత రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్, కోల్‌కతా నగరాలు కొత్త ప్రాజెక్టుల ప్రారంభం, అమ్మకాల్లో మిగిలిన నగరాల కంటే త్వరితగతిన కోలుకున్నట్లు నివేదికలో స్పష్టం చేశారు.
గణనీయంగా పెరిగిన కొత్త ప్రాజెక్టులు
హైదరాబాద్ మహా నగరంలో కొత్తగా హౌజింగ్ యూనిట్లు (ఇండ్లు, అపార్టుమెంట్లు) గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో భాగ్యనగరం దూకుడును ప్రదర్శిస్తున్నది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 9,349 కొత్త యూనిట్లు ప్రారంభమవగా, రెండో త్రైమాసికంలో 7,363 యూనిట్లు మొదలయ్యాయి. అదే మూడో త్రైమాసికానికి వచ్చేసరికి మళ్లీ 9,256కు పెరిగాయి. దేశంలోని మిగిలిన మెట్రో నగరాలతో చూస్తే ఇదే అధికం. రెండో స్థానంలో బెంగళూరు నగరం ఉన్నది.
ఆఫీస్ స్పేస్‌లో ఐటీ టాప్
దేశవ్యాప్తంగా ఏడు మెట్రో నగరాల్లోని ఆఫీస్ స్పేస్ అమ్మకాలను విశ్లేషిస్తే.. ఐటీ రంగంలోనే అధికంగా ఉన్నాయి. గతేడాదీ ఇదే పరిస్థితి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ అమ్మకాలకు సంబంధించి ఐటీ రంగం 34%తో ముందుండగా, ఉత్పత్తి రంగంలో 29 శాతం, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్)లో 13 %, కో-వర్కింగ్ 6%, మిగిలిన రంగాల్లో 19 శాతం అమ్మకాలు నమోదయ్యాయి.
ప్రభుత్వ విధానాలతోనే వృద్ధి
‘ఆఫీస్ స్పేస్ అమ్మకాల్లో హైదరాబాద్ రికార్డును నెలకొల్పింది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఆదరణ ఎక్కువగా ఉన్నది. సరళంగా ఉన్న ప్రభుత్వ విధానాలు, గణనీయమైన మౌలిక వసతులు, సామాజిక-ఆర్థిక అనుకూలతలే ఈ వృద్ధికి ఊతమిచ్చాయి’