Hyderabad | స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం. తెలంగాణ రాష్ట్రం ఇందుకు చక్కని ఉదాహరణగా నిలుస్తున్నది.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండటంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా విస్తరిస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాపర్టీకి అంతకంతకూ డిమాండ్ పెరిగిపోతుండగా, ఇక్కడి భూములు కోట్లు పలుకుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ పాలన, విధానాలు కలిసొస్తుండగా.. వ్యాపార, పారిశ్రామిక రంగాలు రాష్ట్ర రాజధానికి క్యూ కడుతున్నాయి. దీంతో అటు రెసిడెన్షియల్, ఇటు కమర్షియల్ మార్కెట్లలో ఇప్పుడు దేశంలో హైదరాబాదే అందరికీ ఫేవరేట్‌గా నిలుస్తున్నది. ఇందుకు దేశ, విదేశీ ప్రాపర్టీ కన్సల్టెంట్లు ఇస్తున్న నివేదికలే నిదర్శనం.
హైదరాబా ద్, నవంబర్ 14: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరుగులు పెడుతున్నది. ఇక్కడి నివాస గృహాలకున్న డిమాండ్‌కు పెరిగిన రిజిస్ట్రేషన్లే అద్దం పడుతున్నాయి. గత నెల అక్టోబర్‌లో నిరుడుతో పోల్చితే 25 శాతం పెరిగి 5,787 నివాస గృహాలు అమ్ముడయ్యాయి. విలువ సైతం 41 శాతం ఎగిసి రూ.3,170 కోట్లుగా నమోదైనట్టు ప్రముఖ అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ భారతీయ విభాగం తాజా నివేదికలో వెల్లడించింది. మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు బాగా జరిగాయి.
గతంతో పోల్చితే ఇండ్ల కొనుగోలుదారులు విశాలంగా ఉన్న నివాసాలకే మొగ్గు చూపుతున్నారు. నిరుడు అక్టోబర్‌తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్‌లో 1,000-2,000 చదరపు అడుగులున్న ఇండ్లు 3 శాతం ఎక్కువగా అమ్ముడయ్యాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో 69 శాతానికి చేరాయి. ఇదే సమయంలో 500-1,000 చదరపు అడుగులున్న నివాసాలకు డిమాండ్ 5 శాతం క్షీణించి 16 శాతానికే పరిమితమైంది. 2,000-3,000 చదరపు అడుగులున్న ఇండ్ల రిజిస్ట్రేషన్లూ 2 శాతం ఎగిసి 10 శాతంగా ఉన్నాయి.
ఒక హాల్, బెడ్రూం, కిచెన్ ఉండే 1బీహెచ్‌కే ఇండ్లకు గిరాకీ క్రమేణా పడిపోతున్నది. నిరుడు అక్టోబర్‌తో చూస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో అమ్మకాలు 2 శాతం నుంచి 1 శాతానికి దిగజారాయి. అలాగే రెండు బెడ్రూంలు ఉండే 2బీహెచ్‌కే ఇండ్లకూ డిమాండ్ తగ్గిపోతున్నది. గతంతో పోల్చితే విక్రయాల్లో వీటి వాటా 35 శాతం నుంచి 30 శాతానికి క్షీణించింది. అయితే మూడు బెడ్రూంలు గల 3బీహెచ్‌కే నివాసాలకు కొనుగోలుదారుల్లో ఆదరణ పెరిగింది. 56 శాతం నుంచి 58 శాతానికి చేరింది. నాలుగు బెడ్రూంలు ఉండే 4బీహెచ్‌కే నివాసాల కొనుగోళ్లూ 5 శాతం నుంచి 7 శాతానికి పెరగడం గమనార్హం. ఇవి 3,000 చదరపు అడుగులకుపైగానే ఉంటుండగా, విలువ రూ.4.5 కోట్లపైనేనని నైట్‌ఫ్రాంక్ చెప్తున్నది.
ప్రోత్సాహక విధానాలు
రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ప్రత్యేక దృష్టి ఎంతగానో కలిసొస్తున్నది. స్టార్టప్‌ల దగ్గర్నుంచి బడా కంపెనీలదాకా ఇప్పుడు అన్నీ హైదరాబాద్‌లోనే కొలువుదీరుతున్నాయి. ముఖ్యంగా ఆయా దేశాల్లోని దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో తమ రెండో అతిపెద్ద కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇక్కడి యువతకు భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తుండగా, వీరిలో చాలామంది ఇక్కడే స్థిర నివాసాలను ఏర్పర్చుకుంటున్నారు. దీంతో ఇండ్ల కొనుగోళ్లు నానాటికీ పెరుగుతూపోతున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న సుస్థిర ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఇదంతా జరుగుతున్నదని వారు కొనియాడుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు బాగున్నాయని వివరిస్తున్నారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతకంతకూ వృద్ధి చెందుతున్నది. ఇక్కడి ఇండ్లకు అన్నివర్గాల నుంచి భారీగా డిమాండ్ వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ఫ్లాట్లకు ఆదరణ పెరుగుతుండటం విశేషం. గృహ రుణాలపై వడ్డీరేట్లు స్థిరంగా ఉండటం కూడా కలిసొస్తున్నది.
-శిశిర్ బైజాల్, నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ