Hyderabad Realty | హైదరాబాద్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 : దాదాపు దశాబ్దకాలం భారతీయ నిర్మాణ రంగానికే తలమానికంగా వెలుగొందిన హైదరాబాద్ రియల్టీ ప్రతిష్ట.. సుమారు గత ఏడాదిన్నరగా మసకబారిపోతున్నది. ఇండ్ల విక్రయాల్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాలను వెనుకకు నెడుతూ వృద్ధిపథంలో నడిచిన ఇక్కడి రియల్ ఎస్టేట్.. ఇప్పుడు అమ్మకాల్లేక ఢీలా పడిపోయింది మరి. ప్రతికూల పరిస్థితుల్లోనూ సత్తా చాటిన హైదరాబాద్‌లో.. రోజులు గడుస్తున్నకొద్దీ హౌజింగ్ సేల్స్ అంచనాలను అందుకోలేక నిరాశపరుస్తూనే ఉన్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్ తాజా నివేదికలోనూ నిరుత్సాహకర గణాంకాలే నమోదవడం రియల్ ఎస్టేట్ వర్గాలను ఒకింత విస్మయానికే గురిచేస్తున్నది.
ఈ ఏడాది జనవరి-మార్చికిగాను ప్రాప్‌టైగర్ విడుదల చేసిన రిపోర్టులో హైదరాబాద్‌లో ఇండ్ల విక్రయాలు గతంతో పోల్చితే 26 శాతం పడిపోయినట్టు తేలింది. గత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 14,298 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అయితే ఈ ఏడాది అవి 10,647 యూనిట్లకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, నెమ్మదించిన పాలసీ నిర్ణయాలతోపాటు హైడ్రా భయాలు అన్నీ కలిసి రియల్ ఎస్టేట్ వృద్ధిని కాలరాశాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే క్రమేణా ఇండ్ల కొనుగోళ్లకు అంతా దూరం జరుగుతున్నారు.
మరోవైపు పొరుగు రాష్ర్టాల రాజధానుల్లో హైదరాబాద్‌తో పోల్చితే భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజా రిపోర్టులో బెంగళూరులో 13 శాతం హౌజింగ్ సేల్స్ పెరిగినట్టు తేలింది. ఏడాది క్రితం 10,381 యూనిట్ల అమ్మకాలే జరిగితే.. ఈ జనవరి-మార్చిలో మాత్రం 11,731 యూనిట్లు అమ్ముడుపోయాయి. అలాగే చెన్నైలో 4,427 యూనిట్ల నుంచి 4,774 యూనిట్లకు పెరిగి సేల్స్‌లో 8 శాతం వృద్ధి కనిపించింది. కాగా, హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-ఎంఎంఆర్, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్‌ల్లోని ఇండ్ల అమ్మకాలపై ప్రాప్‌టైగర్ ఈ నివేదికను విడుదల చేసింది. మొత్తంగా చూసినైట్టెతే ఈ 8 నగరాల్లో 19 శాతం విక్రయాలు పడిపోయాయి. 98,0 95 యూనిట్లుగానే ఉన్నట్టు తేలింది. అధిక ధరలు, డిమాండ్ లేమి, ఆగిన కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు మార్కెట్‌ను దెబ్బతీశాయి.