న్యూఢిల్లీ, జూలై 21: గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల(జీసీసీ) అడ్డాగా హైదరాబాద్ మారుతున్నది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో 922 జీసీసీలు ఏర్పాటయ్యాయి. దేశవ్యాప్తంగా నెలకొల్పిన జీసీసీల్లో ఈ మూడు నగరాల వాటా 55 శాతంగా ఉండటం విశేషమని అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెస్టియన్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం భారత్లో టైర్-1, టైర్-2 నగరాల్లో 1,700 జీసీసీలు నిర్వహిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3,200 జీసీసీల్లో ఒక భారత్లోనే సగానికి పైగా నెలకొల్పారు. దేశవ్యాప్తంగా ఆఫీస్ మార్కెట్ భారీగా వృద్ధిని నమోదు చేసుకుంటుండటం వల్లనే జీసీసీలకు ఎనలేని డిమాండ్ నెలకొన్నదని, ప్రతిభ కలిగిన సిబ్బంది లభిస్తుండటం, మౌలిక సదుపాయాలు మెరుగ్గావుండటం, అనుకూల పాలసీల నిర్ణయాలు ఇందుకు కారణమని వెస్టియన్ సీఈవో శ్రీనివాస్ రావు తెలిపారు.
మొత్తం జీసీసీల్లో 94 శాతం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, పూణె నగరాల్లోనే ఉన్నాయి. ప్రతీయేటా 150 చొప్పున జీసీసీలు అందుబాటులోకి వస్తుండటంతో 2027-28 నాటికి వీటి సంఖ్య 2,100కి చేరుకోనున్నాయి.