Hyderabad | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: నిన్న ప్రాప్‌ఈక్విటీ.. నేడు అనరాక్.. రేపు ???. నివేదిక ఏదైనా.. హైదరాబాద్ నిర్మాణ రంగంలో మందగమనం మాత్రం నిజమేనని తేలుస్తున్నాయి. ఏడాది కిందటిదాకా దేశీయ రియల్ ఎస్టేట్‌ను శాసించిన హైదరాబాద్‌లో ఇప్పుడు ఇండ్ల గిరాకీ అంతంతమాత్రం అన్నట్టుగా తయారైంది మరి. అవును.. హైదరాబాద్‌లో ఇండ్లంటే హాట్‌కేకులే. అంతా ఎగబడి కొనేస్తారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు సీన్ రివర్సైంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నాయి.
ఇండ్ల అమ్మకాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను దాటేసి వృద్ధిపథంలో పరుగులు పెట్టిన హైదరాబాద్‌లో ప్రస్తుతం ఆ స్థాయి డిమాండే కనిపించడం లేదు. దేశీయ ప్రధాన నగరాల మాటెలా ఉన్నా.. హైదరాబాద్ రియల్టీ మాత్రం ఎప్పుడూ జోష్‌తోనే ఉండేది. కానీ ఇప్పుడు క్షీణతలో ముందుంటున్నది. నాడు మార్కెట్ పరిస్థితులతో నిమిత్తం లేకుండా హైదరాబాద్‌లో ఇండ్ల కొనుగోళ్లు భారీగా జరిగితే.. నేడు తగ్గుతున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. గత పదేండ్లలో నిర్మాణ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అవలంభించిన విధానాలూ కలిసొచ్చాయి. హౌసింగ్ మార్కెట్ విపరీతం గా పెరిగిపోయింది. అయితే ప్రభుత్వం మారడంతో మార్కెట్లో నిస్తేజం ఆవరించింది. హైడ్రా కూల్చివేతలతో ఇది పతాక స్థాయికి చేరిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్‌సహా టాప్-7 నగరాల రియల్టీపై గురువారం అనరాక్ ఓ డాటాను విడుదల చేసింది. ఇందులో ఈ జూలై-సెప్టెంబర్‌లో గృహ విక్రయాలు గతంతో పోల్చితే 22 శాతం పడిపోయినట్టు తేల్చింది. కోల్‌కతా (25 శాతం) తర్వాత ఇదే అత్యధికం. పోయినసారి 16,375 యూనిట్ల అమ్మకాలు జరిగితే.. ఈసారి అవి 12,735 యూనిట్లుగానే ఉన్నాయన్నది.