హైదరాబాద్, డిసెంబర్ 10: హైదరాబాద్లో డిజిటల్ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్య డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే రెండో స్థానం లో భాగ్యనగరం నిలిచినట్టు వరల్డ్ లైన్ ఇండియా తాజా సర్వేలో తేలిం ది. ఈ 10 నెలల్లో వరల్డ్ లైన్ ప్రాసెస్ చేసిన డిజిటల్ లావాదేవీల ప్రకారం తొలి స్థానంలో బెంగళూరు ఉన్నది. హైదరాబాద్ తర్వాత చెన్నై, ముంబై, పుణెలున్నాయి. హైదరాబాద్లో కోటికిపైగా డిజిటల్ లావాదేవీలు జరుగగా, విలువ రూ.3వేల కోట్లపైనే.
సర్వే ఇలా..: ప్రజలు తరచుగా సందర్శించే కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, బట్టల షాపులు, మెడికల్ హాల్స్, హోటళ్లు, జ్యుయెల్లరీ షోరూం లు, గృహోపకరణాల మాల్స్, సూపర్ మార్కెట్లలో అమ్మకాల ఆధారంగా ఈ సర్వే జరిగింది. ఈ సందర్భంగా ఆన్లైన్ లావాదేవీల్లో ఈ-కామర్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. పండుగ సీజన్ విక్రయాలు, పెరిగిన వినియోగ సామర్థ్యం డిజిటల్ చెల్లింపులను మరింత పెంచాయని వరల్డ్ లైన్ ఇండియా అభిప్రాయపడింది.
నేడు అమ్మకందారులు, కొనుగోలుదారులు డిజిటల్ చెల్లింపులపట్ల ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతీ త్రైమాసికంలో ఆన్లైన్ లావాదేవీల సంఖ్య, విలువ రెండూ పెరుగుతూపోతున్నాయి. అందరికీ ఇంటర్నెట్ చేరువ కావడం, పెరిగిన స్మార్ట్ఫోన్ల వినియోగం, సులభతరమైన యూపీఐ సేవలు, విస్తరిస్తున్న ఈ-కామర్స్ మార్కెటింగ్ సంస్థలు కూడా డిజిటల్ లావాదేవీలను పరుగులు పెట్టిస్తున్నాయి.
-రమేశ్ నరసింహన్, వరల్డ్ లైన్ ఇండియా సీఈవో
డిజిటల్ లావాదేవీల్లో ఈ-కామర్స్దే 36 శాతం వాటా
28శాతంతో రెండో స్థానంలో గేమింగ్ రంగం
12 శాతం ఆర్థిక సేవలు డిజిటలైజేషన్లోనే
3, 2 శాతంతో చివర్లో విద్య, ప్రయాణ, ఆతిథ్య రంగాలు
యుటిలిటీ, ప్రభుత్వ చెల్లింపుల్లో 10, 9 శాతం నగదు రహితమే