Tanla | హైదరాబాద్, ఆగస్టు 4: హైదరాబాద్ ఆధారిత బహుళజాతి క్లౌడ్ కమ్యూనికేషన్స్ కంపెనీ తాన్లా.. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను తొలిసారిగా ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ రిపోర్టును విడుదల చేసింది. ప్రభుత్వానికి కంపెనీ ద్వారా జరిగిన పన్ను చెల్లింపుల వివరాలను బహీర్గతం చేయడమే ఈ పన్ను పారదర్శక నివేదిక ముఖ్యోద్దేశం. ఏయే రకాల పన్నులను ఎంతెంత చెల్లించామన్నది దీని ద్వారా తాన్లా వెల్లడించింది. ట్యాక్స్ గవర్నెన్స్‌కు, కార్పొరేట్ గవర్నెన్స్‌కు కట్టుబడి ఉన్నామని కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేసింది.
అన్ని విభాగాల్లో చట్టపరంగా పూర్తిస్థాయిలో నిబంధనలను పాటిస్తున్నామని, జవాబుదారీతనం, అత్యుత్తమ ప్రమాణాలను అనుసరిస్తున్నామని తాన్లా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్, సీఈవో ఉదయ్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. విలువల్ని కాపాడుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడటం లేదన్నారు. చిత్తశుద్ధితో, నిబద్ధతతో కూడిన సేవల్ని అందిస్తున్నామని, ఉద్యోగులు, సిబ్బంది, కస్టమర్లను గౌరవిస్తున్నామని తెలియజేశారు. ఇక గత ఆర్థిక సంవత్సరం అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల్చితే ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థ చెల్లించిన పన్నులు 17 శాతం పెరిగినట్టు ఉదయ్ రెడ్డి చెప్పారు. 1999లో మొదలైన తాన్లా.. ప్రపంచంలోని అతిపెద్ద సీపాస్ కంపెనీల్లో ఒకటిగా వెలుగొందుతున్నది. ఈ సంస్థ దేశ, విదేశీ స్టాక్ మార్కెట్లలోనూ నమోదైంది.