ControlS | కోల్‌కతా, జూన్ 27: హైదరాబాద్‌కు చెందిన డాటా సెంటర్ల నిర్వహణ సంస్థ కంట్రోల్ఎస్ డాటాసెంటర్స్ లిమిటెడ్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. వచ్చే ఐదేండ్లలో డాటా సెంటర్ల కెపాసిటీని 600-700 మెగావాట్లకు పెంచడానికి రూ.24 వేల కోట్ల నుంచి రూ.28 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సిద్దార్థ చెన్నారెడ్డి తెలిపారు.
ప్రస్తుతం సంస్థకు ఎనిమిది నగరాల్లో 253 మెగావాట్లతో 15 డాటా సెంటర్లను నిర్వహిస్తున్నది. 300 మెగావాట్ల సామర్థ్యంతో ముంబై, హైదరాబాద్‌లలో కొత్తగా డాటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ద్వితీయ శ్రేణి నగరాలైన పాట్నా, వైజాగ్, భువనేశ్వర్, జైపూర్, లక్నోలో ప్రవేశించనున్నట్లు తెలిపారు.
ముంబై, జూన్ 27: ఫైనాన్షియల్ ఇన్‌ప్లూయెన్సర్ లేదా ఫిన్ఫ్లూయెన్సర్లను నియంత్రించడానికి త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్పర్సన్ మాధాబి పూరి బుచ్ తెలిపారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో రిటైల్ ఇన్వెస్టర్ల ఊహాజనిత బెట్టింగ్‌ల స్థూల ఆర్థికపరమైన చిక్కులపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, జూన్ 27: దేశీయ ఫార్మా ఎగుమతులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 31 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు ఫార్మాగ్జిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. 2004-05లో 3.9 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు, గతేడాదికిగాను 27.85 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలకు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయన్నారు.
అలాగే 2029 నాటికి విదేశాల్లో 10 బిలియన్ డాలర్ల విలువైన పేటెంట్ డ్రగ్ అవకాశాలున్నాయని, వీటిని అందిపుచ్చుకోవడానికి ఫార్మా సంస్థలు పరిశోధనలు-అభివృదిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదన్నారు. మరోవైపు, ఆగస్టు 28 నుంచి 30 వరకు గ్రేటర్ నోయిడాలో అంతర్జాతీయ ఫార్మా ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.