హైదరాబాద్, జనవరి 31(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ను కేవలం ఐటీకి మాత్రమే పరిమితం చేయకుండా అన్ని రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి డీ శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఒక అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రం ఇటీవల విడుదల చేసిన ‘ఆర్థిక సర్వే 2025-26’పై సచివాలయంలో మాట్లాడుతూ… 8.47 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2019-2035 మధ్యకాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నాలుగో నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించబోతున్నట్లు ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ తేల్చిందని, ఇంతటి వార్షిక వృద్ధి రేటు ప్ర పంచంలో మరే ఇతర ప్రధాన నగరాలు సాధించలేదని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరాన్ని విస్తరించడమేగాక ఆరోగ్యం, రవాణా, గృహ నిర్మాణం వంటి రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పి, ప్రతి పౌరుడి జీవన నాణ్యతను పెంచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు, ఇందుకు గుర్తింపుగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2025 ఇండెక్స్‌లో టాప్-10 నగరాల్లో స్థానం లభించిందన్నారు. తెలంగాణ కేంద్రం ఇచ్చే నిధుల మీదో, అప్పుల మీదో ఆధారపడటం లేదని, సొంత పన్నుల నుంచే ఆదాయాన్ని గడిస్తున్నట్లు చెప్పారు.