Hyderabad Airport | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల్లో ఒకటిగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని చేపట్టిన మొదటి దశ విస్తరణ పనులు వేగంగా పూర్తయ్యాయి. తూర్పు భాగంలో చేపట్టిన విమానాశ్రయ విస్తరణ పనులు పూర్తి కావడంతో శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చామని విమానాశ్రయ ఉన్నతాధికారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు.
విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలకు వీలుగా కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన లాంజ్‌ను 6.07 లక్షల చ.అ. విస్తీర్ణంలో అత్యంత మెరుగైన మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 23.4 లక్షల చదరపు అడుగులు ఉండగా, కొత్తగా అందుబాటులోకి వచ్చిన దాంతో మొత్తం 29.50 లక్షల చదరపు అడుగుల్లో టర్మినల్ ఉంటుందని తెలిపారు. కొత్తగా నిర్మించిన తూర్పు ప్రాంతంలో 22 ఎస్కలేటర్లు, 22 ఎలివేటర్లు, పురుషులకు, మహిళలకు 9 చొప్పున విశ్రాంతి గదులు ఉన్నాయి.