గోదావరిఖని, ఆగస్టు 11 : భూగర్భ గనులతో సింగరేణి సతమతమవుతున్నది. ఈ గనుల్లో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధ్యంకాకపోవడంతో ప్రతీయేటా వందల కోట్ల నష్టాలను చవిచూస్తున్నది. సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రామగుండం డివిజన్-1 పరిధిలోని అండర్‌గ్రౌండ్ గనులు గడిచిన ఆరు సంవత్సరాలుగా నష్టాలనే నమోదు చేసుకుంటున్నది. ఆర్జీ-1 డివిజన్లోని మూడు అండర్‌గ్రౌండ్ గనుల్లో రూ.2611.12 కోట్ల నష్టాల పాలు కావడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆర్జీ-1 డివిజన్లో అత్యంత ఆధునిక పద్ధతిలో బొగ్గు వెలికి తీసే జీడీకే-11గనిలో గడిచిన ఆరేండ్లలో రూ.1,066.99 కోట్ల నష్టం సమకూరింది. 2019-20 నుంచి ఏ ఒక్క ఏడాది కూడా లాభాలు ఆర్జించిన పాపాన పోలేదు.
2019-20లో రూ.128 కోట్లు, 2020-21లో రూ. 181.50 కోట్లు, 2024-25లో రూ.143.59 కోట్లు నష్టాలు చవి చూసింది. జీడీకే 2, 2ఏ గనిలో ఆరేండ్లలో రూ.906.13 కోట్ల నష్టాలు వాటిల్లినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2019-20లో రూ.136 కోట్లు, 2023-24లో రూ.174 కోట్లు, 2024-25లో రూ.155.76 కోట్ల నష్టాలు వచ్చాయి. ఈ గనిలో 2019-20లో రూ.70 కోట్లు, 2020-21లో రూ.90 కోట్లు, 2021-22లో రూ.99 కోట్లు, 2022-23లో రూ.125 కోట్లు, 2023-24లో రూ.140 కోట్లు, 2024-25లో రూ.109 కోట్లు ఇలా మొత్తం ఆరేండ్లలో రూ.638 కోట్ల నష్టాలు చవి చూసినట్లు తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. భారీ నష్టాలపాలవుతున్న అండర్‌గ్రౌండ్ గనుల్లో నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించడానికి సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓసీపీ గనుల్లో భారీ లాభాలు ఆర్జిస్తున్న సింగరేణి అండర్‌గ్రౌండ్‌లో నష్టాలను భరిస్తున్నది.