బెంగళూరు, జూలై 29: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హెచ్‌పీ.. ఇప్పటిదాకా ఆవిష్కరించని అత్యంత శక్తివంతమైన పీసీలను తీసుకొచ్చింది. సోమవారం ఓమ్నీబుక్ ఎక్స్, ఎలైట్‌బుక్ అల్ట్రా పేరిట రెండు పవర్ఫుల్ ల్యాప్‌టాప్‌లను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. మెటార్ సిల్వర్ కలర్లో లభించే ఓమ్నీబుక్ ఎక్స్ ధర రూ.1,39,999. అట్మాస్ఫియరిక్ బ్లూ కలర్లో దొరికే ఎలైట్‌బుక్ అల్ట్రా ధర రూ.1,69,934. ఇవి సంస్థకు తొలి కోపైలట్+ సిరీస్ కంప్యూటర్లు కావడం విశేషం. ఇక కీబోర్డ్పైనున్న కోపైలట్ బటన్‌తో యూజర్లకు చాట్‌జీపీటీ ఆధారిత సహాయం అందుతుంది.
దీనివల్ల కంప్యూటర్‌పై వీడియోల ఎడిటింగ్‌తోపాటు ప్రజెంటేషన్ డెవలపింగ్ సదుపాయాలనూ పొందగలమని హెచ్‌పీ సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది. అలాగే కృత్రిమ మేధస్సు (ఏఐ) సహకారంతో వినియోగదారులు పీడీఎఫ్ ఫైల్స్ లేదా ఏ డాక్యుమెంట్లనైనా అప్లోడ్ చేయవచ్చు. అంతేగాక డాక్యుమెంట్ల విశ్లేషణకూ యూజర్లు దీని ఏఐని వాడుకోవచ్చు. ఇందులోని పాలీ కెమెరా ప్రోతో అత్యుత్తమ వీడియో కాన్ఫరెన్సింగ్ చేసుకోవచ్చు. దీనికి స్మార్ట్ 65 వాట్స్ యూఎస్బీ టైప్-సీ స్లిమ్ అడాప్టర్ వస్తున్నది. కేవలం 30 నిమిషాల్లో జీరో నుంచి 50 శాతం చార్జింగ్ అవుతుండటం గమనార్హం.