Ayushman Bharat Yojana | ఆయుష్మాన్ భారత్ యోజన పథకంగా పేరొందిన స్కీం.. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) .. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్లాగ్షిప్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం ఇది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి చౌకగా హెల్త్ కేర్ సేవలు అందుబాటులోకి తేవడానికి కేంద్రం తెచ్చిన ఇన్సూరెన్స్ స్కీం. మీరు ఈ స్కీం నుంచి బెనిఫిట్ పొందేందుకు అర్హులైతే.. ఆయుష్మాన్ భారత్ యోజన పథకం కింద బెనిఫిట్లు పొందాలని భావిస్తున్నట్లయితే.. ఆన్లైన్లో ఈ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం..
ముందుగా పీఎంజేఏవై అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. ఈ వెబ్ సైట్ తేలిగ్గా యాక్సెస్ కావాలంటే కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్కు స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి సుమా..
పీఎంజేఏవై పథకం కింద బెనిఫిట్లు పొందడానికి అర్హత కీలకం. అది తెలుసుకోవడం ముఖ్యం. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారి కోసం రూపుదిద్దుకున్నదే ఈ పథకం. కనుక సామాజిక-ఆర్థిక కుల జనాభా (ఎస్ఈసీసీ) జాబితా, అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) లేదా రాష్ట్రీయ స్వస్థ్య బీమాయోజన (ఆర్ఎస్బీవై) కార్డు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన అర్హతలు ఉన్నాయా అని తెలుసుకోవాలి. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశిత అర్హతలను, మార్గదర్శకాలను చెక్ చేసుకోవాలి.
అధికారిక పీఎంజేఏవై వెబ్సైట్లోకి వెళ్లి ‘యామ్ ఐ ఎలిజిబుల్ (Am I Eligible) టాబ్ వద్దకెళ్లి క్లిక్ చేయాలి. మీ మొబైల్ ఫోన్ నంబర్ లేదా రేషన్ కార్డు నంబర్ నమోదు చేయడం ద్వారా మీ అర్హతల చెకింగ్ కు పేజీ రీడైరెక్ట్ అవుతుంది. ఆన్ లైన్లో వస్తున్న సూచనలకు అనుగుణంగా, అడిగిన సమాచారం తప్పనిసరిగా రికార్డు చేస్తూ ముందుకు వెళ్లాలి.
ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులని తీలిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ నింపడానికి సిద్ధం కావాలి. వెబ్సైట్లో ‘న్యూ రిజిస్ట్రేషన్’ లేదా ‘అప్లయ్’ టాబ్ వద్ద క్లిక్ చేయాలి. అటుపై మీ పేరు, వయస్సు, లింగం, ఆధార్ నంబర్, రేషన్ కార్డు నంబర్, చిరునామా, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తదితర వివరాలు అప్ టూ డేట్ నమోదు చేయాలి.
అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా మీ అర్హత, గుర్తింపు ధృవీకరణ పత్రాలు అప్ లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయం సర్టిఫికెట్, అవసరమైతే కుల ధృవీకరణ పత్రం, ఇతర పత్రాలు సమర్పించాలి. ఈ పత్రాలు అప్ లోడ్ చేయడానికి ముందు స్కాన్ చేయాలి.
అప్లికేషన్ ఫామ్ నింపి, అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేసిన తర్వాత నమోదు చేసిన సమాచారం అంతా ఒకసారి సమీక్షించుకోవాలి. ఆ వివరాలతో మీరు సంతృప్తి చెందితే.. ఆయుష్మాన్ భారత్ యోజన పథకంలో చేరేందుకు మీరు నింపిన అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
విజయవంతంగా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత, సంబంధిత అధికారులు మీరు పంపిన అప్లికేషన్ పత్రాన్ని సమీక్షిస్తారు. అందచేసిన సమాచారాన్ని ధృవీకరిస్తారు. మీరు పంపిన దరఖాస్తు ఆమోదం పొందితే మీకు ఆయుష్మాన్ భారత్ యోజన కార్డు వస్తుంది. దాన్ని మీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుగా కూడా వాడుకోవచ్చు. ఎంప్యానెల్డ్ దవాఖానల జాబితాలో నగదు రహిత చికిత్స, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ పొందొచ్చు.
అర్హులైన ప్రజలకు చౌకగా ఆరోగ్య పరిరక్షణ సేవలు అందుబాటులోకి తేవడానికి వీలుగా ఆన్లైన్లో ఆయుష్మాన్ భారత్ యోజన (పీఎంజేఏవై) పథకం కోసం ఆన్లైన్లో అప్లికేషన్ వెసులుబాటు కల్పించారు. దీనికి సంబంధించి అడిగిన సమాచారం ఇస్తూ ఫామ్ నింపితే సరి.. మీ అప్లికేషన్ ప్రాసెస్ తేలిగ్గానే పూర్తవుతుంది.