Stock Market | ముంబై, ఫిబ్రవరి 11 : దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా ఐదోరోజూ సూచీలు భారీగా నష్టపోయాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం సుంకం విధించడంతోపాటు తమపై సుంకాలు విధిస్తున్న దేశాలపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. మరోసారి ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటం దేశీయ సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మంగళవారం కూడా 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,200 పాయింట్లకు పైగా నష్టపోయి రెండు వారాల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సూచీ 1,018 పాయింట్లు లేదా 1.32 శాతం కోల్పోయి 77 వేల పాయింట్ల దిగువకు 76,293.60 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 23 వేల పాయింట్ల దిగువకు జారుకున్నది.
చివరకు 309.80 పాయింట్లు లేదా 1.32 శాతం కోల్పోయి 23,071.80 వద్ద ముగిసింది. అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల చుట్టూ కొనసాగిన అనిశ్చిత పరిస్థితికి తోడు దేశీయ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటం కూడా మార్కెట్ల పతనానికి ఆజ్యం పోశాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. చిన్న, మధ్యతరహా సూచీ లు అత్యధికంగా నష్టపోయాయన్నారు. జొ మాటో షేరు పతనం కొనసాగుతున్నది. మంగళవారం కూడా కంపెనీ షేరు 5 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్‌గ్రిడ్, లార్సెన్ అండ్ టుబ్రో, టాటా మోటర్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్, ఐటీసీలు అత్యధికంగా నష్టపోయాయి. కేవ లం భారతీ ఎయిర్టెల్ మాత్రమే నష్టపోయిం ది. రంగాలవారీగా చూస్తే రియల్టీ అత్యధికంగా 3.14 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు కన్జ్యూమర్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, మెటల్ రంగ సూచీలు కూడా రెండు శాతం వరకు కోల్పోయాయి.
మదుపరులకు నిరాశే మిగులుతున్నది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో చిన్న, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన వారికి సూచీల పతనం వారీకి గుబులురేపుతున్నది. గడిచిన ఐదు రోజులుగా సూచీలు పతనం చెందడంతో మదుపరులు రూ. 17 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. అంతర్జాతీయంగా స్టాక్ మా ర్కెట్లు భారీగా పతనం చెందడం, ఎఫ్ఐఐలు భారీగా నిధులను తరలించుకుపోవడం, అమెరికా టారిఫ్ యుద్ధానికి తెరలేపడం వంటి కారణాలు మార్కెట్ సెంటిమెంట్‌ను నిరాశపరిచాయి. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ 2,290.21 పాయింట్లు లేదా 2.91 శాతం నష్టపోయింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రూ.16,97,903.48 కోట్లు కరిగిపోయి రూ.4,08,52,922.63 కోట్లు(4.70 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. మంగళవారం ఒకేరోజు మదుపరులు రూ.9,29,651.16 కోట్ల సంపదను కోల్పోయారు.