iPhone 16 | ఐఫోన్ (iPhone).. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లను కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ కలకలు కంటుంటారు. అయితే, ఆ కలలు అందరికీ నెరవేరవు. అందుకు కారణం సాధారణ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ ధరలు చాలా ఎక్కువగా ఉండడమే. ఈ ఫోన్లు దక్కించుకోవాలంటే మన నెల జీతం సరిపోదు. ఐఫోన్లు ప్రతి ఒక్కరి బడ్జెట్‌కు పూర్తిగా సరిపోకపోవచ్చు. కొందరు నెలల తరబడి కష్టపడి పని చేసి వచ్చిన సొమ్మును పొదుపు చేస్తూ.. ఐఫోన్ కొనుక్కుంటుంటారు.
ఇక తాజాగా ఆపిల్ సంస్థ తన తదుపరి మోడల్ ఐఫోన్ 16 సిరీస్‌ను కూడా అందుబాటులోకి తెచ్చేసింది. దీని ధర రూ.70 వేలకు పై మాటే. ఈ నేపథ్యంలో ఓ సంస్థ కీలక అధ్యయనం చేసింది. ఈ ఫోన్ దక్కించుకోవాలంటే ఏ దేశంలోని ప్రజలు ఎన్ని రోజులు పని చేయాలన్నదానిపై పరిశోధన చేసింది. ఐఫోన్ ఇండెక్స్ (iPhone Index) పరిశోధన ప్రకారం.. ఐఫోన్ 16 కొనుగోలు చేయాలంటూ స్విట్జర్లాండ్ ప్రజలు కేవలం నాలుగు రోజులు పనిచేస్తే సరిపోతుంది. ఇక అగ్రరాజ్యం అమెరికాలోని ప్రజలు మాత్రం 5.1 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఆస్ట్రేలియన్లు, సింగపూర్ వాసులు 5.7 రోజులు పనిచేస్తే కానీ, ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను కొనుగోలు చేయలేరు. ఇక భారత్ విషయానికొస్తే కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను సొంతం చేసుకోవాలనుకున్న భారతీయులు ఏకంగా 47.6 రోజులు పనిచేయాలని సదరు అధ్యయనం సూచిస్తోంది. ఐఫోన్ 16 ప్రొ (128 జీబీ) ధర ఆధారంగా ఐఫోన్ ఇండెక్స్ ఈ అధ్యయనం చేసింది.
ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లను ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్.. అనే నాలుగు మోడళ్లను ఆపిల్ తీసుకొచ్చింది. వీటిల్లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను జత చేశారు. అదే విధంగా ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18తో వచ్చింది. ఇదిలా ఉండగా.. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,900గా, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా, ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 1,19,900గా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభం ధర రూ. 1,44,900గా ఉన్నాయి. ఈ ఫోన్లు నేటి నుంచి భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం తెల్లవారుజామున నుంచి ముంబైలోని బీకేసీ స్టోర్, న్యూ ఢిల్లీలోని సాకేత్ సహా భారతదేశంలోని ఆపిల్ రిటైల్, ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.
Also Read..
iPhone 16 | భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల అమ్మకాలు.. వాటి విశేషాలు మీకోసం
Apple – iPhone 16 | ఐ-ఫోన్ 16 కోసం ఎగబడ్డ జనం.. తెల్లవారుజాము నుంచే ఆపిల్ స్టోర్ల ముందు క్యూ