Home Sales | ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. కరోనా మహమ్మారి తర్వాత స్పేసియస్గా ఉండే ఇండ్లకు ప్రాధాన్యం ఏర్పడింది. గతేడాదితో పోలిస్తే 2024లో ఇండ్ల విక్రయాల్లో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. ఇండ్ల విక్రయాలు తగ్గినా.. వాటి విలువ మాత్రం పెరిగిందని ప్రముఖ రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ చైర్మన్ అనూజ్ పూరి పేర్కొన్నారు. దేశంలోని ఏడు ప్రధాన నగరాల పరిధిలో 2023తో పోలిస్తే 2024లో ఇండ్ల విక్రయాలు నాలుగు శాతం తగ్గాయి. కొత్త వెంచర్లు దాదాపు 4.6 లక్షల యూనిట్లు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో 2023తో పోలిస్తే ఇండ్ల విలువ 16 శాతం పెరిగి రూ.5.68 లక్షల కోట్లకు చేరుకున్నదని ప్రముఖ రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. ఏడు నగరాల పరిధిలో ఇండ్ల ధరలు సగటున 21 శాతం పెరిగాయి. భూమి ధరలు, కార్మికులు, భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్లే ఇండ్ల ధరలు పెరిగాయని అనరాక్ వెల్లడించింది.
రెగ్యులేటరీ సంస్థల ఆమోదం, సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో ఇండ్ల విక్రయాలతోపాటు కొత్త వెంచర్ల ప్రారంభం కూడా తగ్గుముఖం పట్టిందని అనరాక్ పేర్కొంది. ఇబ్బందుల మాటెలా ఉన్నా, ఇండ్ల ధరలు పెరిగాయని పేర్కొంది. 2023తో పోలిస్తే 2024లో ఇండ్ల విక్రయాలు 4,76,530 యూనిట్ల నుంచి 4,59,650 ఇండ్ల (స్వల్పంగా నాలుగు శాతానికి) కు పడిపోయాయి. విక్రయించిన ఇండ్ల విలువ రూపేణా 2023లో రూ.4.88 లక్షల కోట్లు ఉంటే.. ఈ ఏడాది ఇండ్ల విక్రయాల విలువ రూ.5.68 లక్షల కోట్లు.
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఇండ్ల విక్రయాలు ఆరు శాతం తగ్గాయి. 2023లో 65,625 యూనిట్లు విక్రయిస్తే, ఈ ఏడాది 61,900 యూనిట్లకు పరిమితం అయ్యాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలో ఇండ్ల విక్రయాలు ఒక్కశాతం పెరిగి 1,53,870 యూనిట్ల నుంచి 1,55,335 యూనిట్లకు చేరుకున్నాయి. బెంగళూరులోనూ ఇండ్ల సేల్స్ రెండు శాతం పెరిగాయి. 2023లో 63,980 యూనిట్ల నుంచి 65,230 యూనిట్లకు పుంజుకున్నాయి. పుణెలో ఆరు శాతం తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలో ఇండ్ల విక్రయాలు ఐదు శాతం పడిపోయి 86,689 నుంచి 81,090 యూనిట్లకు చేరుకున్నాయి. 2023లో 61,715 యూనిట్ల నుంచి 58,540 యూనిట్లకు పరిమితం అయ్యాయి. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై పరిధిలో ఏకంగా 11 శాతం సేల్స్ పడిపోయాయి. 2023లో 21,630 యూనిట్ల నుంచి 19,220 యూనిట్లకు చేరుకున్నాయి. కోల్ కతాలో 20 శాతం తగ్గి 23,030 ఇండ్ల నుంచి 18,335 ఇండ్లకు పడిపోయాయి.