Home Sales | కరోనా తర్వాత దేశంలో సొంతింటికి ప్రాధాన్యం పెరిగింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇండ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. 2020తో పోలిస్తే 71 శాతం పుంజుకున్నాయి. గతేడాది 2,36,530 ఇండ్లు అమ్ముడయ్యాయి. ఇది 2019 గణాంకాలతో పోలిస్తే కేవలం 10 శాతం తక్కువ. 2020లో 1,38,350 ఇండ్ల విక్రయాలు జరిగితే, 2019లో 2,61,358 యూనిట్లను ఇండ్ల కొనుగోలుదారులు సొంతం చేసుకున్నారు. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలో 2021లో సొంతిండ్ల కొనుగోళ్లు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. 2020లో కేవలం 8,560 ఇండ్లు అమ్ముడైతే, గతేడాది 25,410 యూనిట్లను కొనుగోలు దారులు సొంతం చేసుకున్నారు.
ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలో 72 శాతం పెరిగాయి. 2020లో 44,320 ఇండ్లు అమ్ముడైతే, గతేడాది 76,400 యూనిట్లకు చేరాయి. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోనూ 73 శాతం గ్రోత్ కనిపించింది. 2020లో 23,210 మంది సొంతిండ్లు కొనుగోలు చేస్తే 2021లో 40,050 ఇండ్లు అమ్ముడయ్యాయని రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ నివేదిక వెల్లడించింది.
చాలా తక్కువ వడ్డీరేట్లకే ఇండ్ల రుణాలు లభించడంతో సొంతింటి కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీ తగ్గించడంతోపాటు ఇండ్ల డెవలపర్లు ఇచ్చిన ఆఫర్లు, డిస్కౌంట్లు సొంతింటి కొనుగోలు దారులకు కలిసి వచ్చాయి. గతేడాది నాలుగో త్రైమాసికంలో ఫెస్టివ్ డిమాండ్, ఇతర సానుకూల అంశాలతో మొత్తం ఇండ్ల విక్రయాలు దాదాపు 39 శాతం పెరిగాయి.
మహారాష్ట్రలోని పుణెలో 53 శాతం పురోగతి రికార్డయింది. 2020లో 23,460 ఇండ్లు అమ్ముడైతే 2021లో 35,980 మంది ఇండ్లను సొంతం చేసుకున్నారు. బెంగళూరులో 33 శాతం ఇండ్ల సేల్స్ పెరిగాయి. 2020లో 24,910 ఇండ్లు సేల్ అయితే, 2021లో 33,080 ఇండ్ల అమ్మకాలు జరిగాయి. చెన్నైలో 86 శాతం వృద్ధి నమోదైంది. 2020లో 6740 ఇండ్లను కొనుగోలుదారులు సొంతం చేసుకుంటే 2021లో 12,530 ఇండ్లు అమ్ముడయ్యాయి. కోల్కతాలో ఇండ్ల సేల్స్ 7150 నుంచి 13080 యూనిట్లు పెరిగాయి.
2021, 2022ల్లో ఇండ్ల విక్రయాల్లో చాలా సంతృప్తికర వృద్ధి కనిపిస్తుందని అనరాక్ చైర్మన్ అనూజ్ పూరీ చెప్పారు. 2022లో ఇండ్ల సేల్స్.. ప్రీ-కోవిడ్ స్థాయికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్ముందు ఇండ్ల కొనుగోళ్లు మరింత సంఘటితం అవుతాయన్నారు. అయితే ఇన్ పుట్ కాస్ట్ వ్యయం, సప్లయ్ చైన్ అంశాలతో ఇండ్ల ధరలు 5-8 శాతం పెరిగే అవకాశం కనిపిస్తుందని అన్నారు.