న్యూఢిల్లీ, జూన్ 23 : దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అంతంతమాత్రంగానే ఉంటాయని ప్రాప్‌ఈక్విటీ అంచనా వేసింది. తాజా వివరాల ప్రకారం ఈసారి ఓవరాల్‌గా 94,864 యూనిట్ల విక్రయాలకే పరిమితం కావచ్చని తేలింది. గత ఏడాది ఏప్రిల్-జూన్‌లో 1,16,432 యూనిట్ల విక్రయాలు జరుగగా, దానితో పోల్చితే ఇప్పుడు 19 శాతం తగ్గుతాయని తేటతెల్లమవుతున్నది. ఇదే నిజమైతే.. ఒక త్రైమాసికంలో లక్ష ఇండ్లు కూడా అమ్ముడుపోని పరిస్థితి రావడం 14 త్రైమాసికాల్లో ఇదే తొలిసారి. 2021 జూలై-సెప్టెంబర్‌లో లక్షకు దిగువనే హౌజింగ్ సేల్స్ ఉన్నాయి.
కాగా, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, నవీ ముంబై, థానే, పుణె, కోల్‌కతా, చెన్నై నగరాల్లోని హౌజింగ్ సేల్స్‌పై ఈ సర్వే జరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో 20 శాతం పడిపోయి 11,815కు పరిమితం కావచ్చని ప్రాప్‌ఈక్విటీ చెప్తున్నది. గత ఏడాది ఏప్రిల్-జూన్‌లో 14,704 యూనిట్ల సేల్స్ ఉన్నట్టు తెలిపింది. ఈ అంచనాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. దీనికి కారణం మోదీ సర్కారేనని దుయ్యబట్టారు. ప్రజల జేబులను ఖాళీ చేశారని, ఇండ్లు కొనుక్కునే పరిస్థితి ఎక్కడుందని మండిపడ్డారు.