Home Sales | ఇన్పుట్ కాస్ట్‌తో ఇండ్ల ధరలు పెరిగినా.. కొవిడ్-19 తర్వాత ప్రతి ఒక్కరిలోనూ సొంతింటిపై మమకారం ఎక్కువైంది. ఇండ్ల రుణాలపై బ్యాంకులు వడ్డీ పెంచినా.. ఇండ్ల కొనుగోళ్లకు మాత్రం గిరాకీ తగ్గడం లేదు. 2022లో సొంతిండ్ల కొనుగోళ్లు నూతన రికార్డు నమోదు చేశాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సొంతిండ్ల విక్రయాలు.. అంతకుముందు 2014 రికార్డును తిరగరాశాయి. 2021లో 2,36,500 ఇండ్ల అమ్మకాలు జరిగితే ఈ ఏడాది 3,64,900 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 54 శాతం ఎక్కువ.
ఇక నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)తోపాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు, పుణె, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా నగరాల్లో 2014లో అమ్ముడైన 3,43,000 ఇండ్ల రికార్డును 2022 చెరిపేసిందని ప్రముఖ రియాల్టీ అధ్యయన సంస్థ అనరాక్ నిగ్గు తేల్చింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కొత్త ఇండ్ల నిర్మాణ వెంచర్లు గరిష్ఠ స్థాయిలో మొదలయ్యాయి. 2021తో పోలిస్తే హైదరాబాద్‌లో సొంతిండ్ల సేల్స్ 87 శాతం పెరిగాయి. గతేడాది 25,406 ఇండ్లు అమ్ముడైతే, ఈ ఏడాది 47, 487 ఇండ్లు అమ్ముడు పోయాయి.
ఈ ఏడాది సొంతిండ్ల విక్రయానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) మరోమారు హాట్స్పాట్లుగా నిలిచాయి. ఎంఎంఆర్ పరిధిలో 1,09,700 యూనిట్లు అమ్ముడైతే, ఎన్సీఆర్లో 63,700 కుటుంబాలు సొంతింటి కల సాకారం చేసుకున్నాయి. కోల్‌కతాలో 21,200 (62 శాతం), చెన్నైలో 16,100 (29 శాతం వృద్ధి) ఇండ్లు అమ్ముడయ్యాయి.
ఒకవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, అధిక ధరలను కట్టడి చేయడానికి బ్యాంకులు వడ్డీరేట్లు పెంచడంతో ఇండ్ల ధరలు భారీగా పెరిగాయి. కానీ 2014 నాటి రికార్డును అధిగమించి టాప్-7 నగరాల్లో ఇండ్ల సేల్స్ నమోదయ్యాయని అనరాక్ చైర్మన్ అనూజ్ పూరీ చెప్పారు. ఇండ్ల ధరలతోపాటు వడ్డీరేట్ల పెంపుతో ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇండ్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంచనా వేశారు. కానీ గత మూడు నెలల్లోనే 92,160 ఇండ్ల విక్రయాలు నమోదయ్యాయి.
ఎన్సీఆర్ పరిధిలో ఈ ఏడాది కొత్త వెంచర్ల ప్రారంభానికి ఆంక్షల అమలెతో కొత్తగా సుమారు 22,350 ఇండ్ల నిర్మాణాలు నమోదు అయితే, 63,700 యూనిట్ల సేల్స్ రికార్డయ్యాయని అనూజ్ పూరీ చెప్పారు. టాప్-7 నగరాల పరిధిలో 2021లో 2,36,700 యూనిట్లు ప్రారంభమైతే, ఈ ఏడాది 3,57,600 ఇండ్ల నిర్మాణం మొదలైంది. ఇది గతేడాదితో పోలిస్తే 51 శాతం ఎక్కువ. ఎంఎంఆర్, హైదరాబాద్ పరిధిలో కొత్త ఇండ్ల నిర్మాణం సుమారు 54 శాతం పెరిగింది. ఇక పుణె, బెంగళూరు నగరాల్లో కొత్త ఇండ్ల నిర్మాణాలు 86 శాతం వృద్ధి చెందాయి.
2023 తొలి త్రైమాసికంలోనూ ప్రస్తుత ఇండ్ల విక్రయాల ట్రెండ్ కొనసాగుతుందని అనూజ్ పూరీ అంచనా వేశారు. వచ్చే ఏడాది వడ్డీరేట్లను బట్టి దేశవ్యాప్తంగా ఇండ్ల విక్రయాలు ఆధారపడి ఉంటాయన్నారు. వివిధ వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ఇండ్ల ధరలు 4-7 శాతం పెరిగాయి.