న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీయ హోటల్ పరిశ్రమ 7-9 శాతం మధ్యలో ఆదాయ వృద్ధిని సాధించనున్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది. గడిచిన పదేండ్లుగా తక్కువ స్థాయిలో ఆదాయ వృద్ధిని నమోదు చేసుకుంటున్న హోటల్ పరిశ్రమ మాత్రం వచ్చే ఏడాది ఇంతకంటే అధిక వృద్ధిని నమోదు చేసుకోనున్నదని పేర్కొంది. పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటం, అత్యధికంగా సమావేశాలు జరుగుతుండటం, ఇన్సెంటీవ్స్, సమావేశాలు, ఎగ్జిబిషన్లు, పెళ్లిళ్లు, ఆధ్యాత్మిక, బిజినెస్ పర్యటనలు పెరుగుతుండటం ఇందుకు కారణమని విశ్లేషించింది. దేశవ్యాప్తంగా ప్రీమియం హోటళ్లలో సరాసరి గది రేటు రూ.7,200-7,400 నుంచి రూ.7,800-8 వేల వరకు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది.