Savings | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): నాభి నిండితే నవాబుకైన జవాబు చెప్పొచ్చు అనేది పాత సామెతగా మారింది. జేబు నిండుగా పైసలు ఉంటే నవాబులాగైనా బతకొచ్చనేది నేటి విధానంగా… పొదుపు విధానంలో మార్పు వస్తున్నది. ఇటీవల కాలంలో మెట్రో నగరాల్లో నివసించేవారు పొదుపు చేసే పద్ధతిని మార్చుకుంటున్నారు. తాజాగా హోం క్రెడిట్ సంస్థ చేసిన అధ్యయనంలో చేతిలో డబ్బులు ఉంచుకోవడమే అసలైన పొదుపుగా భావిస్తున్నట్లుగా తేలింది. గతంలో మాదిరిగా స్టాక్ మార్కెట్లు లేదా డిపాజిట్లు, ఇతర ఆర్థిక మార్గాల్లో పెట్టుబడి పెట్టిన వాళ్లే… ఇప్పుడు వాటన్నింటికంటే చేతిలో డబ్బులు ఉంచుకోవడమే సురక్షితమని అనుకుంటున్నట్లుగా తన నివేదికలో వెల్లడించింది.
ఒకవైపు సైబర్ నేరాలు, మరోవైపు స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలతో పొదుపు విషయంలో జనాభిప్రాయం మారుతున్నదని అధ్యయనంలో తేలింది. సంపాదించిన పైసలు కళ్ల ముందర ఉండటమే మంచిదనే భావన ఎక్కువైపోయింది. ఆన్లైన్ మోసాలు, నష్టాల భయం కారణంగా డబ్బులను ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజవేస్తున్నారు. పాత కాలంలో మాదిరిగా సంపాదించిన డబ్బులను ఇంట్లో నిల్వ చేసుకునే విధానం ఇటీవల కాలంలో భారీగా పెరిగిందనీ చెబుతున్నారు. దేశంలోని అన్ని మెట్రో నగరాలను ప్రామాణికంగా తీసుకుని చేసిన అధ్యయనం ద్వారా మెజార్టీ జనాలు క్యాష్ సేవింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా స్పష్టమైంది. చేతిలో డబ్బులు ఉంటేనే ఆర్థిక స్వతంత్రత, సాధికారికతగా భావిస్తున్నారు. ఈ తరహా ఆలోచన ధోరణి మహిళల్లో ఎక్కువగా ఉండేదని, కానీ మగవారు కూడా ఇదే తరహా పొదుపు మంచిదనే భావనతో ఉన్నారు.
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో డబ్బులను పొదుపు చేస్తున్న వారిలోనే ఎక్కువగా దక్షిణాదికి చెందినవారని తెలిపింది. ఇందులో మహిళలు ముందు వరుసలో ఉండగా…. ఇటీవల కాలంలో 39 శాతం మంది పురుషులు కూడా క్యాష్ రూపంలోనే సేవింగ్ చేస్తున్నట్లుగా వెల్లడైంది. ఉత్తరాదిలో 26శాతం మందే క్యాష్ సేవింగ్ పాటిస్తే, దక్షిణాదిలో 80 శాంత మంది ఇంట్లో డబ్బులను నిల్వ చేసుకుంటున్నారు. అదేవిధంగా మెట్రో నగరాల వారీగా 53 శాతం, టైర్ 1 నగరాల్లో 28శాతం, టైర్ 2 నగరాల్లో 38శాతం మంది క్యాష్ సేవింగ్ విధానమే సురక్షితంగా భావిస్తున్నారు.
పురుషులు: 37 శాతం
మహిళలు : 59 శాతం
పొదుపు చేస్తున్న వారిలో
చెన్నై 65 శాతం
బెంగుళూరు 82 శాతం
హైదరాబాద్ 82 శాతం
కొచ్చి 88 శాతం