Hindenburg-Jack Dorsey | గత జనవరి 24న భారత్ పారిశ్రామికవేత్త గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్‌పై విమర్శలు చేసిన యూఎస్ షార్ట్ షెల్లింగ్ సంస్థ `హిండెన్‌బర్గ్` గురువారం మరో సంచలనం రేపింది. త్వరలో అతిపెద్ద నివేదిక బయటపెడతామని ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే మరో నివేదిక వెల్లడించింది. ఈ సారి ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సీని లక్ష్యంగా చేసుకున్నది. జాక్ డోర్సీ ఆధ్వర్యంలోని పేమెంట్స్ సంస్థ బ్లాక్ (Block Inc) అక్రమాలపై ఎక్కు పెట్టింది. ఈ బ్లాక్ సంస్థ భారీ అక్రమాలు చేసిందని పేర్కొంటూ హిండెన్‌బర్గ్ తన ట్విట్టర్ ఖాతాలో సంబంధిత నివేదిక లింక్‌ను ట్వీట్ చేసింది. జాక్ డోర్సీ సారధ్యంలోని ఈ బ్లాక్ తన ఖాతాదారుల సంఖ్య ఎక్కువ చేసి, ఖర్చులు తక్కువ చూపి ఇన్వెస్టర్లను మోసగించిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. రెండేండ్లుగా తాము చేసిన పరిశోధనలో `బ్లాక్`లో జరిగిన పలు కీలకాంశాలు గుర్తించామని తన నివేదికలో వెల్లడించింది.
`ఒక క్రమ పద్దతి ప్రకారం ఇన్వెస్టర్ల నుంచి బ్లాక్ సాయం పొందిందని మా రెండేండ్ల పరిశోధనలో తేలింది. ఆవిష్కరణ పేరిట కస్టమర్లు, ప్రభుత్వాన్ని తేలిగ్గా మోసగించడమే బ్లాక్ వ్యాపారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. నిబంధనలు అతిక్రమించి, రుణాల పేరిట దోపిడీకి పాల్పడటం, రివల్యూషనరీ టెక్నాలజీ పేరిట కంపెనీ గణాంకాలు పెంచి ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడమే బ్లాక్ వ్యాపార లక్ష్యం` అని హిండెన్ బర్గ్ పేర్కొంది. బ్లాక్ సంస్థ ఖాతాల్లో 40-75 శాతం వరకు ఫేక్ అని ఆ సంస్థ ఉద్యోగులే తమకు చెప్పారని వివరించింది.
హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడి కాగానే ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో బ్లాక్ షేర్ విలువ 18 శాతం పతనమైంది. బ్లాక్ కస్టమర్లలో ఎక్కువ మంది నేరగాళ్లు, అక్రమ బిజినెస్‌లు చేసేవారు ఉన్నారని హిండెన్‌బర్గ్ నివేదిక సారాంశం. కరోనా మహమ్మారి వేళ జాక్ డోర్సీ, బ్లాక్ మరో కో-ఫౌండర్ జేమ్స్ మాకెల్వేయ్ కలిసి 100 కోట్ల డాలర్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారని ఆ నివేదిక తెలిపింది. బ్లాక్ సీఎఫ్‌వో అమృతా అహుజా, మేనేజర్ బ్రెయిన్ గ్రాస్సాడోనియా వంటి వారు మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారని పేర్కొంది.
గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ తన షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలకు పాల్పడుతున్నదని, ఖాతాల్లోనూ ఫ్రాడ్ చేస్తున్నదని హిండెన్‌బర్గ్ గత జనవరి 24న ఆరోపించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి అదానీ గ్రూప్ లిస్టెడ్ సంస్థల షేర్లు భారీగా పతనం అయ్యాయి. అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 140 బిలియన్ డాలర్లకు పైగా కొడిగట్టుకుపోయింది. అప్పటి వరకు గ్లోబల్ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగిన గౌతం అదానీ వ్యక్తిగత సంపద కూడా భారీగా హరించుకపోయింది.