Adani – Hindenburg | యూఎస్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ ‘హిండెన్ బర్గ్’ చేసిన ఆరోపణలు ‘ఉద్దేశపూర్వక దాడి’ అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ వ్యాఖ్యానించారు. సోమవారం అదానీ గ్రూపు 32వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ గతేడాది తమ కంపెనీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) దెబ్బ తీయడమే లక్ష్యంగా హిండెన్ బర్గ్ తమ గ్రూపుపై ఆరోపణలు చేసిందని అన్నారు. ‘మమ్మల్ని డీఫేమ్ చేయడానికి డిజైన్ చేసిన కుట్ర అది. ఇది రెండు వైపులా జరిగిన దాడి. మా గ్రూప్ ఆర్థిక స్థితిగతులపై అర్థంలేని ఆరోపణలు చేసింది’ అని పేర్కొన్నారు.
అదానీ గ్రూప్ ఆస్తులకంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయని, పన్ను రాయితీలకు స్వర్గధామాలుగా ఉన్న దేశాల నుంచి స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడిందని గతేడాది జనవరి 23న హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ కకావికలమైంది. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ హరించుకుపోగా, ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ టాప్ నుంచి కిందకు పడిపోయింది. హిండెన్ బర్గ్ ఆరోపణల తర్వాత గౌతం అదానీ సారధ్యంలోని అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ సహా అన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడులను మదుపర్లు భారీగా ఉపసంహరించారు.

‘వాస్తవాల వక్రీకరణతోపాటు రాజకీయ ఆరోపణలతో షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ దాడిచేసింది’ అని గౌతం అదానీ చెప్పారు. ఉద్దేశ పూర్వకంగా మార్కెట్లో అంతరాయం కలిగించడానికే వ్యూహాత్మకంగా హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిందన్నారు. దేశంలోని ఒక వర్గం మీడియా కూడా ‘హిండెన్ బర్గ్’ ఆరోపణలను ఎగదోసిందని వ్యాఖ్యానించారు. దీనివల్ల తన పరపతి దెబ్బ తినడంతోపాటు తన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయామని చెప్పారు. వీలైనంత మేరకు గరిష్టంగా పరపతితోపాటు ఆర్థికంగా నష్టం చేసేందుకే హిండెన్ బర్గ్ ఆరోపణల పర్వం సాగిందని అన్నారు.
ఈ పరిస్థితుల్లో తమ కంపెనీల ప్రయోజనాలను కాపాడుకునేందుకు మార్జిన్ లింక్డ్ ఫైనాన్స్ కంపెనీల వద్ద తీసుకున్న రూ.17,500 రుణాలను ముందస్తుగా చెల్లించి మదుపర్లు, రుణదాతల విశ్వాసాన్ని కాపాడుకున్నామని గౌతం అదానీ చెప్పారు. ఎఫ్‌పీఓ ద్వారా సేకరించిన రూ.20 వేల కోట్ల నిధులను తిరిగి మదుపర్లకు ఇచ్చేయాలని అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మదుపర్ల పట్ల అంకిత భావం, నైతిక వ్యాపార పద్దతుల పట్ల తమ నిబద్ధతను తెలియ జేస్తుందన్నారు.
Samsung Galaxy S24 Ultra | టైటానియం ఎల్లో కలర్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా.. ఇవీ డిటైల్స్..!
SBI | ఈ ఏడాది కొత్తగా 400 శాఖలు ప్రారంభిస్తాం.. తేల్చేసిన ఎస్బీఐ చైర్మన్ ఖరా..!
Citroen C3 Aircross | సిట్రోన్ బంపరాఫర్.. సీ3 ఎయిర్ క్రాస్‌పై రూ.2.62 లక్షల వరకూ డిస్కౌంట్..!