Hindenburg | `ఫ్రాడ్ ఈజ్ ఫ్రాడ్`.. `ప్రపంచంలోకెల్లా సంపన్నుల్లో ఒకరిగా ఉన్న వ్యక్తి చేసిన పని ఇది` అని హిండెన్‌బర్గ్ స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగా భారత్‌పై దాడి చేస్తున్నామన్న అదానీ గ్రూప్ వాదనను అంగీకరించబోమన్నది. హిండెన్‌బర్గ్ నివేదికపై ఇన్వెస్టర్లలో భయాందోళనను తొలగించేందుకు గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ వివరణ ఇచ్చింది. దానిపైనా హిండెన్‌బర్గ్ వెంటనే రియాక్టయింది. ఇటీవలి వరకు ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న పారిశ్రామికవేత్త సారధ్యంలోని భారత్ రెండో అతిపెద్ద కార్పొరేట్ సంస్థ `మోసం` చేస్తున్నదన్న తమ నివేదికకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పింది.
`ఇది స్పష్టం. భారత్ ఒక శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశం, సమీప భవిష్యత్‌లో సూపర్ పవర్‌గా అవతరిస్తుందని మేం విశ్వసిస్తున్నాం` అని హిండెన్‌బర్గ్ వ్యాఖ్యానించింది. `భారత్ భవిష్యత్‌ను అదానీ గ్రూప్ వెనక్కి లాగుతున్నది. దేశాన్ని ఒక పద్దతి ప్రకారం అదానీ గ్రూప్ లూటీ చేస్తున్నదని కూడా మేం విశ్వసిస్తున్నాం` పేర్కొన్నది.
`భారత్‌పై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నదని మా సంస్థపై చేసిన ఆరోపణను కొట్టి పారేస్తున్నాం` అని హిండెన్‌బర్గ్ తేల్చి చెప్పింది. కీలక ఆరోపణలపై స్పందించకుండా జాతీయ వాదం మాటున `ఫ్రాడ్`ను కప్పి పుచ్చుకోలేరని వెల్లడించింది. హిండెన్‌బర్గ్ నివేదికలోని ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. అమెరికాలో హిండెన్‌బర్గ్‌పై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించింది. అదానీ గ్రూప్‌లో ఫ్రాడ్ లావాదేవీలు, గ్రూప్ సంస్థల అధిక రుణ భారంపై ఈ నెల 24న హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడి కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు, ఇన్వెస్టర్లు విలవిల్లాడుతున్నారు. అదానీ గ్రూప్ లిస్టెడ్ గ్రూప్ సంస్థలు 72 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.
తమ నివేదికలో సంధించిన 88 ప్రశ్నల్లో 62 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో అదానీ గ్రూప్ విఫలమైందని హిండెన్‌బర్గ్ పేర్కొన్నది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత 330 పేజీల నివేదికతో అదానీ గ్రూప్ వివరణ ఇచ్చింది. దానికి ప్రతిగా హిండెన్‌బర్గ్ 413 పేజీలతో కూడిన ప్రకటన చేసింది.
గౌతం అదానీ సోదరుడు వినోద్ అదానీ సారధ్యంలోని విదేశీ సంస్థల లావాదేవీలతో తమకు సంబంధం లేదని అదానీ గ్రూప్ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని హిండెన్‌బర్గ్ పేర్కొన్నది. విదేశాల్లోని వినోద్ అదానీ షెల్ కంపెనీలతోనే అదానీ గ్రూప్ మోసాలకు పాల్పడుతున్నదని తాము సాక్ష్యాధారాలతో బయట పెట్టాం అని తెలిపింది.