న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: అదానీ గ్రూప్ అవకతవకలపై సంచలనాత్మక రిపోర్టుల్నిచ్చిన హిండెన్‌బర్గ్ రిసెర్చ్.. అనూహ్యంగా గత నెల మూతబడిన విషయం తెలిసిందే. అయితే ఎవరికీ భయపడి తాను సంస్థను మూసేయలేదని ఈ అమెరికన్ షార్ట్ సెల్లర్ వ్యవస్థాపక అధినేత నాథన్ అండర్సన్ స్పష్టం చేశారు. తమపై లీగల్గాగానీ లేక వ్యక్తిగతంగాగానీ ఎవరూ ఏ రకమైన బెదిరింపులకు దిగలేదన్న అండర్సన్.. కేవలం పని ఒత్తిడి కారణంగానే హిండెన్‌బర్గ్ రిసెర్చ్‌ను మూసేసినట్టు పీటీఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లలో అక్రమాలకు పాల్పడిందంటూ 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ రిసెర్చ్ ఓ రిపోర్టును విడుదల చేసిన సంగతి విదితమే. దీంతో అదానీ కంపెనీల షేర్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలాయి. తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి.
ఫలితంగా అటు గ్రూప్, అదానీ వ్యక్తిగత సంపద ఏకంగా 150 బిలియన్ డాలర్లకుపైగా కరిగిపోయింది. వ్యాపార-పారిశ్రామిక వర్గాల్లోనేగాక, రాజకీయంగానూ ఇది తీవ్ర దుమారాన్నే రేపింది. ఇక ఈ వ్యవహారంలో సెబీ చీఫ్ మాధవీ పురి బచ్ దంపతుల హస్తం కూడా ఉందని గత ఏడాది ఆగస్టులో మరో బాంబు పేల్చింది. దీంతో పార్లమెంట్‌లోనూ ఆ ప్రకంపనలు కనిపించాయి.