Hindenburg – SEBI | అదానీ గ్రూపు (Adani Group) సంస్థల్లో వాటాల కొనుగోలు, ఆ గ్రూపుతో అనుబంధంపై దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ (SEBI)’, ఆ సంస్థ చైర్ పర్సన్ మాధాబి పురీ బుచ్ (Madhabi Puri Buch), యూఎస్ షార్ట్ షెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం సాగుతోంది. అదానీ గ్రూపు సంస్థలతో సెబీ చీఫ్ మాధాబి పురీ బుచ్ కుటుంబం అక్రమంగా ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నారని ఆమె ప్రకటనే రుజువు చేస్తుందని హిండెన్ బర్గ్ తెలిపింది. ‘మా నివేదికపై సెబీ చైర్ పర్సన్ మాధాబి పురీ బుచ్ ఇచ్చిన వివరణతో ప్రస్తుతం కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మా నివేదికలోని పలు ముఖ్యమైన అంశాలను ఆమె అంగీకరించారు’ అని హిండెన్ బర్గ్ రీసెర్చ్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. హిండెన్ బర్గ్ ఆరోపణలు నిరాధారం అంటూనే బెర్ముడా/మారిషస్ వంటి అఫ్ షోర్ కంపెనీల్లో, అందునా గౌతం అదానీ సోదరుడు వినోద్ అదానీ ఆధ్వర్యంలోని ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు బుచ్ ఫ్యామిలీ అంగీకరించిందని గుర్తుచేసింది.
‘తన భర్త బాల్య స్నేహితుడు నిర్వహిస్తున్న ఫండ్‌లోనూ పెట్టుబడులు పెట్టామని ధృవీకరించారు. ఆ సమయంలో సదరు వ్యక్తి అదానీ గ్రూప్ సంస్థల డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడుల తీరును సమీక్షించాల్సిన ‘సెబీ’.. అదానీ గ్రూపులో తమ పెట్టుబడులు సమీక్షించాల్సి వస్తే వ్యక్గిగత హోదాలో మాధాబి పురీ బుచ్ పెట్టిన పెట్టుబడుల వివరాలను ప్రధానంగా హైలేట్ చేశాం. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుంది’ అని పేర్కొంది.
సెబీ చైర్ పర్సన్‌గా కొనసాగుతూనే మాధాబి పురీ బుచ్.. కన్సల్టింగ్ సంస్థలను నడుపుతున్నారని హిండెన్ బర్గ్ ఆరోపించింది. సింగపూర్ లో నివసిస్తున్నప్పుడు ఏర్పాటు చేసిన కంపెనీల్లో ‘అగోరా అడ్వైజరీ లిమిటెడ్ (ఇండియా)’లో 99 శాతం వాటా బుచ్ లదేనని గుర్తు చేసింది. ఈ కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆదాయం పొందుతూ మరోవైపు అదానీ గ్రూప్ సంస్థలపై దర్యాప్తు చేశారని పేర్కొంది. సెబీ పూర్తికాల సభ్యురాలిగా చేరినప్పటి నుంచి ఆమె తన భర్త పేరిట ఉన్న ఈ-మెయిల్స్ ద్వారా వ్యాపార లావాదేవీల వివరాలు తెలుసుకుంటారని కూడా ఆరోపించింది.
‘పూర్తి పారదర్శకత, నిబద్ధతతో పని చేస్తామని ప్రకటన ద్వారా హామీ ఇచ్చిన మాధాబి పురీ బుచ్.. తమ కన్సల్టింగ్ క్లయింట్ల జాబితాను ప్రకటించారు. ఆఫ్ షోర్ కంపెనీ ‘సింగపూర్ కన్సల్టింగ్ కంపెనీ, ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీ’ ఈ జాబితాలో ఉన్నాయి. ఏ ప్రయోజనం కోసం వాటిని నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారంపై సెబీ చైర్ పర్సన్ పూర్తిగా పారదర్శకంగా, బహిరంగ విచారణ జరిపిస్తారా?’ అని ప్రశ్నించింది.