న్యూఢిల్లీ, మే 2: అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును జూన్ 26 వరకూ ఈపీఎఫ్వో పెంచింది. అర్హులైన వారందరూ దరఖాస్తులు సమర్పించేందుకు వీలుగా గడువుతేదీని 2023 జూన్ 26 వరకూ పెంచుతున్నట్టు మంగళవారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తెలిపింది. గత ఏడాది నవంబర్ 4న సుప్రీం కోర్టు జారీచేసిన ఉత్తర్వుల మేరకు అధిక పెన్షన్ కోరుతూ పెన్షనర్లు, యాజమాన్యాల ఆప్షన్లను, ఉమ్మడి ఆప్షన్లను ఇవ్వడానికి ఈపీఎఫ్ఏ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. వీటిని ఆన్లైన్లో సమర్పించడానికి 2023 మే 3 గడువు తేదీగా నిర్ణయించగా, తాజాగా దీనిని జూన్ 26 వరకూ పొడిగించింది. ఇప్పటివరకూ 12 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు ఈపీఎఫ్వో వెల్లడించింది. గడువును పొడిగించాలంటూ పెన్షనర్లు, ఉద్యోగులు, యాజమాన్యాలు, వివిధ అసోసియేషన్ల నుంచి వచ్చిన వినతుల మేరకు గడువు పొడిగించాలని నిర్ణయించినట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.