న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: దేశ వృద్ధిరేటు అంచనాలను తగ్గించింది ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను భారత జీడీపీ 7 శాతానికే పరిమితం కాగలదని గురువారం పేర్కొన్నది. అధిక వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణ స్థాయిలే ఇందుకు కారణమని ఈ నెల గ్లోబల్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో వివరించింది. ఈ ఏడాది జూన్‌లో దేశ జీడీపీ ఈసారి 7.8 శాతంగా ఉండొచ్చని ఫిచ్ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే ఇంతలోనే దాన్నిప్పుడు 7 శాతానికి కుదించడం గమనార్హం. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24) జీడీపీ అంచనాను కూడా 7.4 శాతం నుంచి 6.7 శాతానికి కోత పెట్టింది. కాగా, అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఏప్రిల్-జూన్‌లో జీడీపీ వృద్ధి 13.5 శాతంగా నమోదైందని, తాము 18.5 శాతంగా అంచనా వేశామని గుర్తుచేసిన ఫిచ్.. దేశ ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అన్ని అంచనాల్లోనూ కోతలే
ఫిచ్ మాత్రమేగాక మూడీస్, సిటీగ్రూప్, గోల్డ్‌మన్ సాచ్స్ కూడా భారత జీడీపీ అంచనాల్ని తగ్గించాయి. గత ఏడాది దేశ వృద్ధిరేటు 8.3 శాతంగా ఉంటుందన్న మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్.. ఈ ఏడాది 7.7 శాతం, వచ్చే ఏడాది 5.2 శాతమేనన్నది. నిజానికి మార్చిలో ఈ ఏడాది వృద్ధిరేటు 8.8 శాతంగా ఉంటుందన్నది. కానీ ఆ తర్వాత దానికి 1.1 శాతం మేర కోత పెట్టి 7.7 శాతంగానే చెప్పింది. ఇక సిటీగ్రూప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను తమ వృద్ధిరేటు అంచనాను 8 శాతం నుంచి 6.7 శాతానికి తీసుకొచ్చింది. గోల్డ్‌మన్ సాచ్స్ కూడా 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. ఎస్బీఐ 6.8 శాతంగా, ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ 6.9 శాతంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 7.2 శాతంగా అంచనా వేస్తున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ ఏడాది ఆఖరుదాకా 79 వద్దే ఉంటుందని ఈ సందర్భంగా ఫిచ్ అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 6.2 శాతంగా ఉండొచ్చన్నది.
అంధకారంలో దేశ ఆర్థిక వ్యవస్థ
దేశ ఆర్థిక వ్యవస్థ అంధకారంలో ఉన్నదని భారత మాజీ ప్రధాన స్టాటిస్టీషియన్ ప్రొఫెసర్ ప్రణబ్ సేన్ అన్నారు. సమస్యలు తెలుస్తున్నా.. వాటికి పరిష్కారాలు మాత్రం కనిపించడం లేదని ‘ది వైర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ జీడీపీ అంచనాను అందుకోకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈ రంగంతోపాటు వాణిజ్య, ఆతిథ్య, రవాణా, సమాచార, ప్రసారాల వంటి కీలక సేవా రంగాల్లో సమస్యలున్నాయని తెలిపారు. కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాకపోవడం, ఉన్న ఉద్యోగాలు పోయి నిరుద్యోగం పెరగడం వంటివి కూడా ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు సవాల్ విసురుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి ఎంఎస్ఎంఈలకు నిధుల ప్రవాహం పెరిగేలా రుణాల పంపిణీ జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈల వాటానే ఎక్కువన్న ఆయన వీటి ఆర్థిక పరిపుష్ఠికి కావాల్సిన చర్యలు తక్షణమే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.