హైదరాబాద్, అక్టోబర్ 17: అమెరికా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్‌కు తెలంగాణలో ఉన్న ప్లాంట్‌ను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెటిరో గ్రూప్ చేజిక్కించుకుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజెర్లలో ఈ ప్లాంట్‌ను హెటిరో రూ.130 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీకేర్ ఉత్పత్తుల తయారీకి 55.27 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ సదుపాయాన్ని ఫార్మా ఉత్పాదక ప్లాంట్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు, విస్తరించేందుకు తాజాగా 75 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 600 కోట్లు) పెట్టుబడి చేయనున్నట్టు హెటిరో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ బండి సోమవారం తెలిపారు. హెటిరోకు ఇది ప్రధాన స్టెరైల్ ఫార్మాస్యూటికల్, బయోలాజిక్స్ తయారీ యూనిట్‌గా ఆవిర్భవిస్తుందని, దీంతో బయోకెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, మాలిక్యులార్ బయోసైన్సెస్, ఇంజనీరింగ్, యాన్సిలరీ సర్వీసుల్లో 2,000 కొత్త ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని వివరించారు. ఈ సదుపాయంలోని స్థలం, ప్లాంట్, యంత్రాల్ని హెటిరో కొనుగోలు చేయడంలో ఫైనాన్షియల్ అడ్వయిజర్‌గా అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ వ్యవహరించింది. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐలు) తయారీలో ప్రపంచంలోని పెద్ద సంస్థల్లో ఒకటిగా ఉన్న హెటిరో గ్లోబల్ జెనిరిక్స్, బయోసిమిలర్స్, కస్టమ్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిలోనూ నిమగ్నమై ఉంది.
ప్లాంట్ అప్‌గ్రేడ్ చేసేందుకు 75 మిలియన్ డాలర్లు పెట్టుబడి చేయడానికి కట్టుబడి ఉన్నాం. 2000 కొత్త ఉద్యోగాల్ని కల్పించే లక్ష్యంతో ఉన్నాం.
-డాక్టర్ వంశీ కృష్ణ బండి, హెటిరో ఎండీ