Hero Motors | ఆటోమొబైల్ విడి భాగాల తయారీ సంస్థ హీరో మోటార్స్ (Hero Motors) తన ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఐపీఓకు అనుమతించాలని కోరుతూ సెబీ ముందు దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) పత్రాలను ఈ నెల ఐదో తేదీ (శనివారం) ఉపసంహరించుకున్నది. పవన్ ముంజాల్ సోదరుడి కుమారుడు పంకజ్ ముంజాల్ సారధ్యంలోని హీరో మోటో కార్ప్ అనుబంధ సంస్థ హీరో మోటార్స్ (Hero Motors) గత ఆగస్టులో సెబీ ముందు ఐపీఓకు అనుమతి కోరుతూ డీఆర్హెచ్పీ దాఖలు చేసింది.
రూ.500 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఐపీఓకు వెళ్లాలని హీరో మోటార్స్ (Hero Motors) తొలుత నిర్ణయించింది. మరో రూ.400 కోట్ల విలువైన షేర్లు గల ఓపీ ముంజాల్ హోల్డింగ్స్, భాగ్యోదయ్ ఇన్వెస్ట్ మెంట్స్, హీరో సైకిల్స్ వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించాలని యోచించారు. ప్రస్తుతం హీరో మోటార్స్ (Hero Motors) ప్రమోటర్లకు సంస్థలో 91.65 శాతం వాటా ఉంది. ఓపీ ముంజాల్ కు హీరో మోటార్స్ లో 71.75 శాతం వాటా, భాగ్యోదయ్ ఇన్వెస్ట్ మెంట్స్ కు 6.28 శాతం, హీరో సైకిల్స్ కు 2.03 శాతం వాటాలు ఉన్నాయి. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఓపీ ముంజాల్ రూ.250 కోట్ల విలువైన షేర్లు, భాగ్యోదయ్ ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ హీరో సైకిల్స్ రూ.75 కోట్ల విలువైన షేర్లు విక్రయించాలని భావించారు.
టూ వీలర్స్ ప్రత్యేకించి బీఎండబ్ల్యూ, డుకాటీ, హార్లీ డేవిడ్సన్ వంటి గ్లోబల్ సంస్థలకు ఇంజిన్, ట్రాన్స్ మిషన్ కాంపొనెంట్లను హీరో మోటార్స్ అందిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో పవర్ ట్రైన్ సొల్యూషన్స్ ద్వారా 49 శాతం ఆదాయం, అల్లాయ్ అండ్ మెటాలిక్ (ఏ అండ్ ఎం) బిజినెస్ సెగ్మెంట్ ద్వారా 51 శాతం ఆదాయం సంపాదించింది. భారత్ నుంచి 59 శాతం రెవెన్యూ, యూరప్ దేశాల నుంచి 29 శాతం, అమెరికా నుంచి 8 శాతం రెవెన్యూ పొందింది.