న్యూఢిల్లీ, జూలై 1: ప్రముఖ వాహన విడిభాగాల సంస్థ హీరో మోటర్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. రూ.1,200 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను సైతం అందించింది. వీటిలో రూ.800 కోట్లు తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా సేకరించనున్న సంస్థ.. మరో రూ.400 కోట్ల నిధులు ప్రమోటర్లకు చెందిన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించడం ద్వారా సమీకరించాలని యోచిస్తున్నది.
ఆఫర్ ఫర్ సేల్ రూట్లో ఓపీ ముంజల్ హోల్డింగ్స్‌కు చెందిన రూ.390 కోట్ల షేర్లను విక్రయించనుండగా, భాగ్యోడే ఇన్వెస్ట్మెంట్స్, హీరో సైకిల్‌కు చెందిన చెరో రూ.5 కోట్ల విలువైన షేర్లను అమ్మేయనున్నారు. ఇలా సేకరించిన నిధుల్లో రూ.285 కోట్లను రుణాలను తిరిగి చెల్లించడానికి, మరో రూ.237 కోట్లను ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచడానికి వినియోగించనున్నారు. ప్రస్తుతం సంస్థకు భారత్‌తోపాటు బ్రిటన్, థాయిలాండ్‌లో ఆరు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.