Hero MotoCorp – EV Scooters | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp).. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సెగ్మెంట్లో తన బేస్ పెంచుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. విస్త్రుత శ్రేణిలో కస్టమర్లకు చేరువయ్యేందుకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈవీ స్కూటర్ల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పని చేస్తోంది. విదా (Vida) బ్రాండ్ కింద ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర పలుకుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి అర్ధభాగంలో ‘మిడ్’, ‘మాస్’ సెగ్మెంట్ ఈవీ స్కూటర్లను మార్కెట్లో ఆవిష్కరిస్తామని హీరో మోటో కార్ప్ చీఫ్ బిజినెస్ (ఎమర్జింగ్ మొబిలిటీ) ఆఫీసర్ బీయూ స్వదేశ్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రీమియం, మిడ్, మాస్ సెగ్మెంట్లలో ఈవీ స్కూటర్లను ఆవిష్కరిస్తామని చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో జూమ్ 125 (Xoom 125), జూమ్ 160 (Xoom 160) ఈవీ స్కూటర్ల ను ఆవిష్కరిస్తామని హీరో మోటో కార్ప్ సీఈఓ నిరంజన్ గుప్తా చెప్పారు. తదుపరి ప్రీమియం సెగ్మెంట్ లోనూ ఈవీ స్కూటర్లు ఆవిష్కరిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈవీ స్కూటర్ల విక్రయంలో వేగం పుంజుకుంటామన్నారు.
కొత్తగా వేర్వేరు భౌగోళిక ప్రాంతాలకు పోర్ట్ పోలియో వారిగా ఈ ఏడాది, వచ్చే ఏడాది తమ ఉత్పత్తులను విస్తరిస్తామని బీయూ స్వదేశ్ శ్రీవాత్సవ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 120 పైచిలుకు నగరాలు, 180 పై చిలుకు టచ్ పాయింట్లలో విదా బ్రాండ్ ఈవీ స్కూటర్లు విక్రయిస్తున్నారు. చార్జింగ్ నెట్ వర్క్ సేవల కోసం ప్రముఖ ఈవీ టూ వీలర్స్ స్టార్టప్ ‘ఎథేర్ ఎనర్జీ’తో హీరో మోటో కార్ప్, విదా బ్రాండ్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎథేర్ ఎనర్జీకి దేశవ్యాప్తంగా 200 నగరాల పరిధిలో 2,000కి పైగా చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి.