Home Loans | పెరుగుతున్న ధరల ప్రభావాన్ని తగ్గించడానికి ఆర్బీఐ రెపోరేట్ పెంచేసింది. తదనుగుణంగా దాదాపు వాణిజ్య బ్యాంకులన్నీ ఇండ్ల రుణాలతోపాటు వివిధ రుణాలపై వడ్డీరేట్లు పెంచేశాయి. అయినా పది బ్యాంకులు ఇప్పటికీ తక్కువ వడ్డీరేటుపై ఇండ్ల రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. ఇండ్ల రుణాలతోపాటు అన్ని రకాల రిటైల్ రుణాలపై రెపోరేట్ మాదిరిగా ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ వడ్డీరేట్లకు లింక్ చేసేందుకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతోపాటు లోకల్ ఏరియా బ్యాంకులు, స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. 2019 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ పాలసీ అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగా మెజారిటీ వాణిజ్య బ్యాంకులు.. ఆర్బీఐ రెపోరేట్‌ను ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌గా లింక్ చేస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఇండ్ల రుణాలపై ఫ్లోటింగ్ రేట్లు అమలు చేస్తున్నాయి.
రెపోరేట్‌ను అనుసంధానించే వడ్డీరేట్లనే రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) అంటారు. రెపోరేట్తోపాటు బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్రేటులో మార్జిన్, రిస్క్ ప్రీమియం కలిపి లెక్కిస్తారు. ప్రతి రెండు నెలలకోసారి ఆర్బీఐ రెపోరేట్‌పై సమీక్షించవచ్చు. బ్యాంక్‌ను బట్టి మార్జిన్, రిస్క్ ప్రీమియం తదితర చార్జీలు మారుతుంటాయి. అయితే వేతన జీవులతో పోలిస్తే ఇండ్ల రుణాలు తీసుకునే స్వయం ఉపాధి లేదా చిన్నపాటి వ్యాపారం చేస్తున్న వారికి రిస్క్ ఎక్కువ. స్వయం ఉపాధిపై బతుకుతున్న వారిపై అదనపు చార్జీలు విధిస్తాయి బ్యాంకులు.
వేతన జీవులకు ఇచ్చే ఇండ్ల రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు
బ్యాంకు పేరు | ఆర్ఎల్ఎల్ఆర్(%) | కనిష్ట వడ్డీ(%) | గరిష్ట వడ్డీ(%) |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 7.50 | 6.80 | 8.05 |
బ్యాంక్ ఆఫ్ ఇండియా | 7.25 | 6.90 | 8.60 |
యాక్సిస్ బ్యాంక్ | 7.00 | 7.00 | 7.30 |
కెనరాబ్యాంక్ | 7.30 | 7.05 | 9.25 |
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ | 6.85 | 7.05 | 7.30 |
కరూర్ వైశ్యా బ్యాంక్ | 7.45 | 7.15 | 9.35 |
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర | 7.70 | 7.30 | 8.70 |
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 7.70 | 7.40 | 9.10 |
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ | 7.50 | 7.40 | 8.25 |
ఇండియన్ బ్యాంక్ | 7.70 | 7.40 | 8.15 |
స్వయం ఉపాధిపై జీవిస్తున్న వారికి ఇచ్చే ఇండ్ల రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు
బ్యాంకు పేరు | ఆర్ఎల్ఎల్ఆర్ (%) | కనిష్ట వడ్డీ (%) | గరిష్ట వడ్డీ (%) |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 7.50 | 7.00 | 8.15 |
బ్యాంక్ ఆఫ్ ఇండియా | 7.25 | 6.90 | 8.75 |
యాక్సిస్ బ్యాంక్ | 7.00 | 7.05 | 7.35 |
కెనరాబ్యాంక్ | 7.30 | 7.10 | 9.30 |
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ | 6.85 | 7.05 | 7.30 |
కరూర్ వైశ్యా బ్యాంక్ | 7.45 | 7.15 | 9.35 |
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 7.70 | 7.40 | 9.10 |
యుకో బ్యాంక్ | 7.80 | 7.40 | 7.60 |
బ్యాంక్ ఆఫ్ బరోడా | 7.45 | 7.45 | 8.80 |
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర | 7.70 | 7.55 | 9.20 |
బ్యాంకులు కనీసం ప్రతి మూడు నెలలకోసారి తప్పనిసరిగా ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా ఇంటి రుణాలపై వడ్డీరేటును ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌కు అనుగుణంగా రీ సెట్ చేస్తాయి. ఏదైనా మార్పు ఉంటే మూడు నెలల్లోపు సంబంధిత కస్టమర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మీరు తీసుకున్న రుణంపై బ్యాంకుల చార్జీలు కూడా వడ్డీరేటును ప్రభావితం చేస్తాయి. మీ క్రెడిట్ స్కోర్‌ను కొన్ని బ్యాంకులు వడ్డీరేటు రీసెట్ చేయడంలో పరిగణనలోకి తీసుకుంటాయి.