కొన్ని నెలలుగా పలు టెక్ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అలా ఉద్యోగాలు కోల్పోయిన వారు తమ బాధలు, ఆవేదనను సోషల్ మీడియా వేదికలపై షేర్ చేస్తున్నారు. తాజాగా అమెరికా మహిళ ఒకరు ఇటువంటి ఆవేదననే లింక్డ్ ఇన్ వేదికగా షేర్ చేసుకున్నారు. 12 ఏండ్లుగా పని చేస్తున్నా.. మెటర్నిటీ లీవ్ లో ఉన్న తనను జాబ్ నుంచి తొలగించారంటూ ఎమోషనల్ అయ్యారు.
‘12 ఏండ్లుగా గూగుల్‌లో పని చేస్తున్న నేను మెటర్నిటీ సెలవుల్లో ఉండగా నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. 10 వారాల పసికందుతో సంతోషంగా ఉన్న వేళ.. లే-ఆఫ్ వార్త విని చాలా బాధ పడ్డా. అయినా ఎప్పటికీ గూగుల్ సంస్థకు రుణపడి ఉంటాను. ఉద్యోగం పోయిన నేపథ్యంలో తర్వాత ఏం చేయాలి.. ఇంటర్వ్యూలకు ఎలా వెళ్లాలి.. ఈ సమయంలో ఉద్యోగం చేయాలా? అనే ఆలోచనలతోనే నా మెదడు నిండిపోయింది’ అని తన పోస్ట్‌లో రాసుకున్నారు.
‘ఏ సంస్థలోనైనా స్టాఫింగ్ మేనేజర్, ప్రోగ్రామింగ్ మేనేజర్ పోస్టులు ఉన్నట్లు తెలిస్తే నాకు తెలపండి. ఐసీ రిక్రూటర్ల కోసం ఎదురు చేస్తున్న వారు నా టీమ్‌ను సంప్రదించండి` అంటూ భావోద్వేగపూరితంగా పోస్ట్ చేశారు. ఆమె పెట్టిన భావోద్వేగ పూరిత పోస్ట్ చూసి, అర్థం చేసుకున్న నెటిజన్లలో కొందరు సానుభూతి తెలుపుతుంటే.. మరికొందరు తామూ ఇటువంటి పరిస్థితులే ఎదుర్కొన్నామని వారి బాధలు షేర్ చేసుకున్నారు.