న్యూఢిల్లీ, మార్చి 26: దేశీయ ఆరోగ్య బీమా రంగం శరవేగంగా దూసుకుపోతున్నది. 9 శాతం వృద్ధితో 2024-25 ఆర్థిక సంవత్సరంలో హెల్త్ బీమా రంగం రూ.1.2 లక్షల కోట్లకు చేరుకున్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆరోగ్య బీమాపై అవగాహన పెరుగుతుండటం, వైద్య ఖర్చుల నుంచి ఆర్థిక రక్షణ కోసం పెరుగుతున్న డిమాండ్ కారణంగా హెల్త్ పాలసీలు అధికంగా తీసుకుంటున్నారని తెలిపింది.
పాలసీదారులకు సకాలంలో మద్దతును అందించడానికి, పనితీరు సామర్థ్యాన్ని పెంపొందించడానికి, నగదు రహిత ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ కోసం నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ నిర్దిష్ట కాలపరిమితులను నిర్దేశించడం కూడా మరో కారణమని విశ్లేషించింది. ముందస్తు అనుమతిని కేవలం గంటలోనే, తుది అనుమతులను మూడు గంటల్లో నిర్ణయం తీసుకోవాలని నిర్దిష్టమైన పరిమితులను ఐఆర్డీఏఐ విధించింది.