న్యూఢిల్లీ, జూన్1: ఇన్సూరెన్స్ సంస్థలు ఇక నూతన బీమా ఉత్పత్తుల్ని వేగంగా విడుదల చేయనున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు కొత్తగా రూపొందించే ఆరోగ్య, సాధారణ బీమా పత్రాల్ని తమ ముందస్తు అనుమతి లేకుండానే మార్కెట్లోకి ప్రవేశపెట్టుకోవొచ్చని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ప్రకటించింది. అన్ని ఆరోగ్య బీమా ప్రొడక్ట్‌లను, దాదాపు అన్ని సాధారణ బీమా పత్రాలకు ‘యూజ్ అండ్ ఫైల్’ (ఉపయోగించిన తర్వాత రెగ్యులేటర్‌కు సమర్పించడం) పద్దతిని అమలు చేయనున్నట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
దేశమంతా బీమా కలిగిఉండేందుకు ఉద్దేశించిన సంస్కరణల ఏజెండాలో భాగంగా ఈ వ్యాపార సరళీకరణను చేపట్టినట్టు తెలిపింది. ఈ సదుపాయంతో వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన బీమా ఉత్పత్తుల్ని, వినూత్న పత్రాల్ని పరిశ్రమ క్రమేపీ విడుదల చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. రెగ్యులేటర్ చేపట్టిన ఈ చర్యతో మరిన్ని వినూత్న ఉత్పత్తుల్ని బీమా కంపెనీలు వేగంగా విడుదల చేయగలుగుతాయని బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో తపన్ సింఘాల్ చెప్పారు. కొత్త పత్రాల్ని రూపొందించిన తర్వాత నియంత్రణా సంస్థ వద్ద ఫైల్ చేసి, అనుమతి కోసం వేచిచూడకుండానే సంస్థలు మార్కెట్లోకి ప్రవేశపెడతాయన్నారు.