కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ కోసం బెడ్స్ దొరకని పరిస్థితి. ఆస్పత్రుల్లోనూ కొత్త పేషెంట్లను అడ్మిట్ చేసుకోలేని పరిస్థితి. కరోన సోకిన ప్రతి ఒకరికి ఆస్పత్రిలోనే చికిత్స చేయాల్సిన అవసరం లేదు. 90 శాతం మంది హోమ్ ఐసోలేషన్ ద్వారా ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈసందర్భంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నవారికి కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చాలావరకు హాస్పిటలైజేషన్కు మాత్రమే వర్తిస్తాయి. అతి కొద్ది పాలసీలు మాత్రమే హోమ్ ట్రీట్ మెంట్, ఔట్ పేషెంట్ ట్రీట్మెంట్లకు బీమాను వర్తింప చేస్తాయి. మరి ఇలాంటి సందర్భంలో కోవిడ్ వచ్చి హోమ్ ఐసోలేషన్‌లో వారికి ఆరోగ్య బీమా కవరేజీ ఎలా?
వేటి కోసం కవరేజీ?
ఐఆర్ డీఏ నిబంధనల ప్రకారం జారీ చేసిన స్టాండర్డ్ కోవిడ్ పాలసీలన్నీ కోవిడ్ ట్రీట్ మెంట్ హోమ్ ఐసోలేషన్‌లో లేదా హాస్పిటల్స్‌లో ఇవ్వాలి. అనేక హాస్పిటల్స్ హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ ప్యాకేజీలను నర్సింగ్, కన్సల్టేషన్, ప్రిస్రిప్షన్, ట్రీట్మెంట్లతో కూడిని ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ ఈ ప్యాకేజీల ప్రత్యేకత. కోవిడ్ స్టాండర్డ్ పాలసీలన్నీ 15 నుంచి 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ తర్వాత క్లయిమ్‌లను ఇస్తున్నాయి. కొన్ని పాలసీల్లో పీపీఈ కిట్స్ వంటి కన్జ్యూమబుల్స్కు కవరేజీ లేదు. కొన్ని పాలసీ వాటికీ కవరేజీ ఉంది. మరి కొన్నింటిలో వాటి వినియోగంపై పరిమితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ స్టాండర్డ్ పాలసీ కొత్తగా తీసుకోవాలనుకుంటే ఈ నియమాలన్నింటినీ పరిశీలించి కొత్త పాలసీని తీసుకోండి.
ఏ పాలసీలు
ఒకేవేళ మీరు కొత్తగా పాలసీ తీసుకుంటున్నట్టయితే కోవిడ్ ట్రీట్మెంట్ గురించి నియమాలు పొందుపరిచి ఉంటాయి. కోవిడ్‌కు ముందు అంటే 2020కి ముందు తీసుకున్న పాలసీల్లో అలాంటి నిబంధన ఉండే అవకాశం లేదు. ఇటీవలి కాలంలో వచ్చిన ఆరోగ్య బీమా పాలసీల్లో చాలావరకు పాలసీ తీసుకున్న తర్వాత వచ్చే కాలక్రమంలో వచ్చు జబ్బులకు ట్రీట్మెంట్కు సంబంధించి కవరేజీ సాధారణంగా ఉంటుంది. అయితే కొన్ని మరీ పాత పాలసీల్లో ఈవిషయంలో కూడా స్పష్టత లేకపోవచ్చు. నాలుగైదేండ్ల క్రితం తీసుకున్న పాలసీల్లో కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చునేమో కానీ, మరీ పాత పాలసీల్లో హోమ్ ట్రీట్మెంట్ల కవరేజీ లేదు. ఈవిషయంలో స్పష్టత కోసం ఒకసారి పాలసీ డాక్యుమెంట్‌ను పరిశీలించండి. అలాగే ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధిని సంప్రదించండి.
నియమాలు…
2020లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ అథారిటీ (ఐఆర్ డీఏ) కోవిడ్ స్టాండర్డ్ హెల్త్ పాలసీల కింద కోవిడ్ ట్రీట్మెంట్ను ఆమోదించింది. ఐఆర్ డీఏ నిబంధన ప్రకారం కోవిడ్ సోకిన వ్యక్తికి ఆరోగ్య బీమా ఉంటే గరిష్టంగా 14 రోజుల పాటు ఇంటి వద్దనే తీసుకునే ట్రీట్ మెంట్‌కు అయ్యే ఖర్చుకు బీమా వర్తిస్తుంది. అయితే హోమ్ ట్రీట్మెంట్ను డాక్టర్లు సూచించడంతో పాటు, డాక్టర్లే మానిటరింగ్ చేస్తూ ట్రీట్మెంట్ను రికార్డ్ చేయాలి. ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్ వర్ ఆఫ్ హాస్పిటల్స్ సంబంధించిన వారైతే, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. నెట్వర్లో లేకపోతే, క్లయిమ్‌లను రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చు. ఈ రెండు పద్ధతుల్లోనూ ఇన్సూరెన్స్ కంపెనీ క్లయిమ్ సెటిల్మెంట్ పద్ధతులనే పాటించాల్సి ఉంటుంది.
క్లెయిమ్ ఎలా?
ప్రతి పాలసీకి క్లెయిమ్‌కు సంబంధించిన నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని తప్పక పాటించాల్సిందే. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ మీ ట్రీట్మెంట్ కు సంబంధించిన డాక్యుమెంట్లను నిర్ణీత కాలంలోగా పొందుపరచాలని సూచిస్తుంది. హోమ్ ట్రీట్మెంట్కు క్లెయిమ్ చేయాలనుకుంటే ఆమోదం పొందిన ల్యాబ్ నుంచి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ టెస్ట్ రిపోర్టు, హాస్పిటల్ బెడ్ తీసుకోక పోవడానికి గల కారణాలు, హోమ్ ట్రీట్మెంట్కు డాక్టర్ చేసిన సిఫార్స్, ప్రిస్రిప్షన్ వంటి డాక్యుమెంట్లతో క్లయిమ్ చేసుకోవచ్చు.
మీకు హోమ్ ట్రీట్మెంట్కు అర్హత లేకపోతే, అర్హత ఉన్న మిగతా వాటికి క్లయిమ్ చేయండి. వెయిటింగ్ పీరియడ్ తర్వాత కోవిడ్ వస్తే హాస్పిటలైజేషన్ లేదా హోమ్ ట్రీట్మెంట్లో వ్యయాలు కూడా కవర్ అవుతాయి. అందుకోసం సరిపడా బేస్ కవరేజీతో పాటు టాప్అప్ కవరేజీని కూడా తీసుకోండి. కాగా, తమకు హాస్పిటల్ నుంచి రిక్వెస్ట్ వచ్చిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీలు ఆథరైజేషన్ గంటలోపే ఇవ్వాలని ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. సెకండ్‌వేవ్‌లో పెరుగుతున్న సీరియస్ కేసుల నేపథ్యంలో హైకోర్డు ఇచ్చిన ఆదేశాల మేరకు ఐఆర్డీఏ ఈ నిర్ణయం తీసుకుంది. బీమా క్లెయిమ్లతోపాటు, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్లకు, డిశ్చార్జీలకు కనీస సమయాన్ని తీసుకోవాలని ఆదేశించింది.