ముంబై, డిసెంబర్ 19: తాకట్టుపై రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ రుణ గ్రహితలకు షాకిచ్చింది. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో కనీస వడ్డీరేటు 8.65 శాతానికి చేరుకున్నది. పెరిగిన వడ్డీరేట్లు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో గృహ రుణాలపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు 35 బేసిస్ పాయింట్లు పెంచడంతో రుణ రేటు 8.65 శాతానికి చేరుకోనున్నది. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు హెచ్డీఎఫ్సీ 2.25 శాతం వడ్డీరేట్లు పెంచినట్లు అయింది. రెపోరేటు కూడా 225 బేసిస్ పాయింట్లు సవరించడంతో రేటు 6.25 శాతానికి చేరుకున్నది. క్రెడిట్ స్కోర్ 800 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి మాత్రమే 8.65 శాతం వడ్డీరేటు వర్తించనున్నది. గృహ రుణాల్లో ఇదే తక్కువ వడ్డీరేటు కావడం విశేషం. మరోవైపు, దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ..750కి పైగా క్రెడిట్ స్కోర్ కలిగిన వారికి 8.75 శాతం వడ్డీకి గృహ రుణం ఇస్తున్నది. ఈ వడ్డీరేటు వచ్చే నెల 31 వరకు అమలులో ఉండనున్నది. అలాగే 800కి పైగా క్రెడిట్ స్కోర్ కలిగిన వారికి 8.90 శాతం వడ్డీకి గృహ రుణం ఆఫర్ చేస్తున్నది. అలాగే 750కి పైగా క్రెడిట్ స్కోర్ కలిగిన వారికి పండుగ ఆఫర్ కింద 8.75 శాతం వడ్డీకి గృహ రుణం అందిస్తున్నది.
యాక్సిస్ బ్యాంక్ కూడా..
యాక్సిస్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను పెంచేసింది. ఎంసీఎల్ఆర్ ని 30 బేసిస్ పాయింట్లు సవరించింది. పెంచిన వడ్డీరేట్లు ఇప్పటికే అమలులోకి వచ్చాయని బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఈఎంఐలు పెరగనుండటంతో గృహ, వాహన, ఇతర రుణాలు చెల్లించేవారికి ప్రభావం పడనున్నది. ఒక్కరోజు, నెల ఎంసీఎల్ఆర్ రుణాలపై వడ్డీరేటు 8.55 శాతానికి, మూడు నెలల రుణాలపై వడ్డీరేటు 8.65 శాతానికి..ఆరు నెలల కాలపరిమితి రుణాలపై వడ్డీరేటు 8.70 శాతానికి సవరించింది. దీంతోపాటు ఏడాది రుణాలపై వడ్డీని 8.75 శాతానికి, రెండేండ్ల 8.85 శాతానికి, మూడేండ్ల 8.90 శాతానికి పెంచింది.