న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వివిధ కాలవ్యవధులపై 85 బేసిస్ పాయింట్ల (0.85 శాతం)దాకా తగ్గించింది. సవరించిన ఎంసీఎల్ఆర్ ఈ నెల 10 నుంచే అమల్లోకి వస్తుంది. ఓవర్‌నైట్ టెన్యూర్‌పై అత్యధికంగా 85 బేసిస్ పాయింట్లు తగ్గగా.. 6 నెలల టెన్యూర్‌పై అత్యల్పంగా 10 బేసిస్ పాయింట్లు దిగింది. ఇక ఏడాది, రెండేండ్లు, మూడేండ్ల కాలవ్యవధులకు సంబంధించి ఎటువంటి మార్పు లేదని తమ వెబ్సైట్లో బ్యాంక్ పేర్కొన్నది. కాగా, తాజా నిర్ణయంతో బ్యాంక్ వ్యక్తిగత, వాహన రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుతున్నది.
ఎంసీఎల్ఆర్ ఆధారంగా ఈ లోన్లు తీసుకున్న పాత కస్టమర్ల ఈఎంఐలపై కొంతమేర భారం తగ్గుతుంది. 2019 అక్టోబర్ 1 నుంచి ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు (ఈబీఎల్ఆర్) అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ నుంచే గృహ రుణాలు ఎక్కువగా మంజూరవుతాయి కాబట్టి ఈ నిర్ణయం.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గృహ రుణాల వడ్డీరేట్లపై పెద్దగా ప్రభావం చూపబోదని చెప్పవచ్చు. ఎంసీఎల్ఆర్ అనేది కనీస వడ్డీరేటు. బ్యాంకులు ఇంతకంటే తక్కువ వడ్డీరేటుకు రుణాలు మంజూరు చేయవు. డిపాజిట్ రేట్లు, ఆర్బీఐ రెపోరేటు, సంస్థాగత నిర్వహణ వ్యయాలు, నగదు నిల్వల నిష్పత్తి నిర్వహణ ఖర్చునుబట్టి బ్యాంకులు ఎంసీఎల్ఆర్ను నిర్ణయిస్తాయి.