Roshni Malhotra : పారిశ్రామిక దిగ్గజం, హెచ్‌సీఎల్ టెక్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రాకు ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పౌరపురస్కారం లభించింది. వ్యాపార ప్రపంచానికి అందించిన సేవలతో పాటు ఫ్రాన్స్, భారత్ మధ్య ఆర్ధిక సంబంధాల బలోపేతానికి చూపిన చొరవకు గాను రోష్నీ మల్హోత్రాకు చెవలియర్ నైట్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హానర్ లభించింది. సామాజిక, పర్యావరణ అంశాలపైనా మల్హోత్రా పనిచేశారు.
ఫ్రాన్స్‌కు అద్భుతమైన సేవలు అందించిన వారికి వారి జాతీయతతో నిమిత్తం లేకుండా ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందచేస్తున్నారు. 1802లో నెపోలియన్ బొనపార్టే ఈ అవార్డును నెలకొల్పారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును రోష్నీ మల్హోత్రాకు భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి థియర్రీ మాధ్యూ అందచేశారు. ఢిల్లీలోని ఫ్రాన్స్ రెసిడెన్సీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఫ్రాన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడి తరపున రోష్నీ మల్హోత్రాకు చెవలియర్ అవార్డును థియర్రీ మాధ్యూ అందించారు.
ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించడం తాను గౌరవంగా భావిస్తున్నానని, భారత్ – ఫ్రాన్స్ వ్యూహాత్మక సంబంధాలను ఇది ప్రతిబింబిస్తుందని రోష్నీ మల్హోత్రా పేర్కొన్నారు. ఫ్రాన్స్‌తో హెచ్‌సీఎల్ టెక్కు దీర్ఘకాలంగా సంబంధాలు ఉన్నాయని, ఫ్రాన్స్ తమకు వ్యూహాత్మక మార్కెట్ అని ఆమె వివరించారు. ఫ్రాన్స్‌లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఫ్రాన్స్ వ్యాపారాలను తమ సేవల ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సాధించేందుకు తోడ్పాటు ఇస్తామని చెప్పారు.
Read More :