Madhabi Buch Puri | దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్పర్సన్ మాధాబి పురీ బుచ్, మరో ఐదుగురు అధికారులకు వ్యతిరేకంగా ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై మంగళవారం బాంబే హైకోర్టు స్టే విధించింది. స్టాక్ మార్కెట్లో మోసం, రెగ్యులేటరీ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను విచారించిన ఏసీబీ కోర్టు.. సెబీ మాజీ చైర్ పర్సన్ మాధాబి పురీ బుచ్, మరో ఐదుగురు అధికారులకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. అయితే ఏసీబీ న్యాయస్థానం పూర్తి వివరాలను పరిశీలించకుండానే తీర్పు చెప్పిందని జస్టిస్ శివ్కుమార్ డిగె సారధ్యంలోని బాంబే హైకోర్టు సింగిల్ బెంచ్ వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ చేపట్టే వరకూ స్టే అమల్లో ఉంటుందని పేర్కొంది. దీనిపై ఫిర్యాదీ దారు నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
సెబీ మాజీ చైర్పర్సన్ మాధాబి పురి బుచ్, ముగ్గురు సెబీ హోల్టైం డైరెక్టర్లు అశ్వనీ భాటియా, అనంత్ నారాయణ్ జీ, కమలేశ్ చంద్ర వర్షనేయ్, బీఎస్ఈ ఎండీ కం సీఈఓ సుందర రామన్ రామమూర్తిలపై ఒక మీడియా ప్రతినిధిగా పని చేస్తున్న సపన్ శ్రీవాత్సవ చేసిన ఫిర్యాదు చేశారు. సపన్ శ్రీవాత్సవ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయస్థానం.. మాధాబి పురి బుచ్ సహా ఐదుగురిపై కేసు నమోదు చేయాలని ఏసీబీని ఆదేశించింది. నిందితులు భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించారని, అవినీతికి పాల్పడ్డారని సపన్ శ్రీవాత్సవ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ సెబీ మాజీ చీఫ్ మాధాబి పురి బుచ్ సహా ఐదుగురు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.