న్యూఢిల్లీ, జూలై 8: ఇటీవలే హైదరాబాద్లో ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఓ సదుపాయాన్ని ప్రారంభించిన ఫ్రాన్స్ ఏరోస్పేస్ కంపెనీ శాఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్స్ తాజాగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో ఒక జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ కొత్త జాయింట్ వెంచర్ కొత్త హెలికాప్టర్ ఇంజిన్లను అభివృద్ధిపరుస్తుంది. హెలికాప్టర్ ఇంజిన్ల అభివృద్ధిపర్చడంతో పాటు ఉత్పత్తి, సేల్స్, సపోర్ట్ కార్యకలాపాల్లో నిమగ్నమవుతుంది. 13 టన్నుల ఐఎంఆర్హెచ్ (ఇండియన్ మల్టీ-రోల్ హెలికాప్టర్)తో సహా దేశ రక్షణ శాఖ కోసం భవిష్యత్ హెలికాప్టర్ల రూపకల్పన, తయారీ జాయింట్ వెంచర్ ప్రధాన లక్ష్యమని హెచ్ఏఎల్ శుక్రవారం తెలిపింది. ఇప్పటికే హెచ్ఏఎల్, శాఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్స్ మధ్య పలు భాగస్వామ్యాలు ఉన్నాయి. హెచ్ఏఎల్ ఉత్పత్తి చేసే హెలికాప్టర్లు ధృవ్, రుద్ర, లైట్ కాంబాట్ హెలికాప్టర్ (ఎల్సీహెచ్) కోసం ఇంజిన్లు అందించే శక్తి ఇంజిన్ ఈ రెండు సంస్థల భాగస్వామ్యం మధ్య నెలకొన్నదే. ఇప్పటివరకూ 500కుపైగా శక్తి ఇంజిన్లను ఉత్పత్తి చేసినట్టు హెచ్ఏఎల్ తెలిపింది.