GST Reforms | కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబులు ఉండగా.. రెండింటికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ సంస్కరణలకు ఆమోదం తెలిపారు. ఈ నెల 22 నుంచి కొత్త శ్లాబులు అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వస్తువులపై పన్నును తగ్గించింది. చాలా ఉత్పత్తులపై జీఎస్టీ 28శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి మాత్రం ఎలాంటి ఊరటనివ్వలేదు. జీఎస్టీ సంస్కరణల తర్వాత కూడా స్మార్ట్ఫోన్లపై జీఎస్టీ 18శాతం వర్తిస్తుంది. మొబైల్ ఫోన్లు ఇప్పటికే 18శాతం శ్లాబ్‌లోనే ఉంటుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
18శాతం తర్వాత 5శాతం శ్లాబ్ మాత్రమే ఉందని.. దాంతో స్మార్‌ఫోన్ తయారీదారులు ఎలాంటి మార్పులను ఆశించడం లేదని.. స్మార్ట్ఫోన్లపై పన్ను తగ్గిస్తే బాగుంటుందని ఇండస్ట్రీ మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకు ముందు ఎయిర్ కండీషన్లపై జీఎస్టీ 28శాతం వర్తించేది. ఇకపై 18శాతం శ్లాబ్‌లోకి ఏసీలు రానున్నాయి. 32 ఇంచులకంటే పెద్ద ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీలపై 28శాతం నుంచి 18శాతానికి తగ్గించారు. ఇప్పటికే 32ఇంచులు, అంతకంటే తక్కువగా ఉన్న టీవీలపై జీఎస్టీ 18శాతం వర్తిస్తున్నది. ఇక కంప్యూటర్ మానిటర్లు, ప్రొజెక్టర్లు ప్రస్తుతం 28శాతం శ్లాబ్‌లో ఉండగా.. వాటిని 18శాతం శ్లాబ్‌లోకి మార్చారు. కిచెన్ డిష్వాషర్లపై సైతం 18శాతం జీఎస్టీ ఉండనున్నది.
ఇదిలా ఉండగా.. 8507 కేటగిరీ కిందకు వచ్చే లిథియం అయాన్ బ్యాటరీలు గతంలో 28శాతం శ్లాబ్ పరిధిలో ఉండగా.. అవి 18శాతం జాబితాలోకి వెళ్లాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత మోడల్‌ను బట్టి ఎయిర్ కండిషనర్ల ధర రూ.1500 నుంచి రూ.2500 వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. టీవీలు, మానిటర్ల ధరలు సైతం తగ్గనున్నాయి. పన్ను తగ్గింపు నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని.. వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు ముందుకు వస్తారని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏసీ, టీవీ వంటి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువల ధరల విషయంలో కాస్త ఉపశమనం లభించనుండగా.. స్మార్ట్ఫోన్లపై ఎలాంటి తగ్గింపు ఉండబోదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న 18శాతం శ్లాబ్‌లోనే ఈ స్మార్ట్ఫోన్లను కొనసాగించడమే కారణమని స్పష్టం చేస్తున్నారు.