GST Reforms | కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబులను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇకపై 5శాతం, 18శాతం జీఎస్టీ శ్లాబులు మాత్రమే ఉండనున్నాయి. దాంతో పాటు కొత్తగా సీన్ జీఎస్టీని తీసుకువచ్చింది. ఇందులో లగ్జరీ వస్తువులతో పాటు కొన్ని వస్తువలపై 40శాతం జీఎస్టీని వసూలు చేయనున్నది. జీఎస్టీ సంస్కరణలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, సంస్కరణలు అమలులోకి వస్తే చిన్న బిస్కెట్ ప్యాకెట్స్, సబ్బులు, టూత్‌పేస్ట్ ప్యాకెట్ల ధరలు తగ్గుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పన్ను శ్లాబ్ తగ్గినా.. తక్కువ విలువ ఉన్న వస్తువుల రిటైల్ అమ్మకం ధరలు (MRP) ఆ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు బదిలీ చేయడం కుదరదని ఎఫ్ఎంసీజీ కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు అండ్ కస్టమ్స్ (CBIC)కి విన్నయించాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపునకు అనుగుణంగా రూ.5, రూ.10, రూ.20 ధర కలిగిన చిన్న ప్యాకెట్లపై ఎంఆర్పీని తగ్గించలేమని ఆయా కంపెనీలు సీబీఐసీకి చెప్పాయి. భారతీయ కొనుగోలుదారులు స్థిరంగా ఉన్న ధరలకు కొనుగోలు చేసేందుకు అలవాటు పడ్డారని.. ధరలను తగ్గించడంతో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని.. సమయంలో లావాదేవీలు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందని తెలిపాయి. గతంలో రూ.20 ధర ఉన్న బిస్కెట్లపై 18శాతం జీఎస్టీ వర్తించేది.
ఈ నెల 22 తర్వాత జీఎస్టీ 5శాతానికి తగ్గనున్నది. ఈ క్రమంలో రూ.20 బిస్కెట్ల ప్యాకెట్ ఎంఆర్పీ ధర రూ.17.80 నుంచి 18 తగ్గుతుంది. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్‌తో కంపెనీలు చర్చలు జరిపాయి. ఈ సందర్భంగా ఓ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ.. జీఎస్టీ రేట్ల తగ్గింపునకు అనుగుణంగా వినియోగదారులకు ఆ ప్రయోజనం అందిస్తామన్నారు. రూ.20 బిస్కెట్ ప్యాకెట్ ధర రూ.20 నుంచి రూ.18కి తగ్గుతుందన్నారు. అయితే, అదే ధరలు కొనసాగినప్పటికీ.. అదనంగా పరిమాణం పెంచనున్నట్లు వెల్లడించారు. అంటే బిస్కెట్ ప్యాకెట్ అదే ధర వర్తించినప్పటికీ.. బరువు మాత్రం ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఈ నిర్ణయం ధరల స్థిరత్వాన్ని కాపాడుతుందని.. వినియోగదారులకు అదనపు పరిమాణంతో ఎక్కువ లాభం పొందుతారన్నారు.