GST | న్యూఢిల్లీ, డిసెంబర్ 3: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబుల్లో కొత్తగా మరొకటి రాబోతున్నదా? ఇప్పుడున్న 5, 12, 18, 28 శాతం శ్లాబులకుతోడు ప్రత్యేకంగా గరిష్ఠ శ్రేణిలో మరో శ్లాబు ఉండబోతున్నదా? అంటే.. అవుననే సమాధానాలే కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం.. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు, వివిధ రకాల శీతల పానీయాలు, గ్యాంబ్లింగ్‌పై 35 శాతం పన్ను వేయాలని ప్రతిపాదించింది మరి. ప్రస్తుతం ఇవన్నీ 28 శాతంలోనే ఉన్నాయి. ఇక సెస్సుతో కలిపితే పన్ను పోటు 57 శాతానికి చేరుతుండటం గమనార్హం. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి నేతృత్వంలోని మంత్రుల బృందం ప్రతిపాదిత జీఎస్టీ రేట్ల సర్దుబాట్లపై తాజాగా సమావేశమైంది. ఈ క్రమంలోనే ఆరోగ్యానికి హానికరమైన, సమాజాన్ని పెడదోవ పట్టించేవాటిపై (సిన్ గూడ్స్) పన్నులను పెంచాలన్న నిర్ణయానికి సభ్యులు వచ్చారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలో ఈ నెల 21న జరుగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రుల బృందం చేసిన ఈ సిఫార్సులు చర్చకు రానున్నాయి. ఆపై తుది నిర్ణయం తీసుకునే వీలున్నది. అయితే పన్ను వసూళ్లను పెంచడంలో భాగంగానే ఆయా వస్తూత్పత్తులపై ఈ ట్యాక్స్ రేట్ల సర్దుబాట్లు అని సమాచారం. దీంతో ఖజానాను నింపుకోవడానికి భవిష్యత్తులో మరిన్ని వస్తూత్పత్తులను ఈ హై రేంజ్ కేటగిరీలోకే మోదీ సర్కారు తెస్తుందా? అన్న అనుమానాలూ తలెత్తుతున్నాయి.
దుస్తులు, మరికొన్నింటిపైనున్న జీఎస్టీ మార్పులపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే విలువనుబట్టి రూ.1,500దాకా 5 శాతం, రూ.1,500-10,000 మధ్య 18 శాతం, రూ.10,000పైన 28 శాతం పన్నులు వేయాలని మంత్రుల బృందం నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తున్నది. మొత్తం 148 వస్తూత్పత్తులు, సేవలపై ప్రస్తుతం పడుతున్న పన్ను రేట్లను సవరించాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. ఇప్పుడు అత్యధిక వస్తూత్పత్తులు, సేవలు 18 శాతం శ్లాబులోనే ఉన్న సంగతి విదితమే.
జీఎస్టీ విధానంలో నిత్యావసరాలకు పన్ను మినహాయింపు (0 శాతం) లేదా కనిష్ఠ శ్లాబు 5 శాతం పన్ను పడుతున్నది. అయితే లగ్జరీ, ఆరోగ్యానికి హాని కలిగించే, సమాజంపై చెడు ప్రభావం చూపే వాటిపై గరిష్ఠంగా 28 శాతం పన్ను ఉన్నది. వీటిలో ఖరీదైన కార్లు, మోటర్‌సైకిళ్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి కన్జ్యూమర్ డ్యూరబుల్స్, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు, కొన్ని రకాల శీతల పానీయాలు, గ్యాంబ్లింగ్, క్యాసినోలు, లాటరీ తదితర ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి.
ఈ 28 శాతం పన్నుకుతోడు అదనంగా 22 శాతం సెస్సు కూడా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా ముడి వజ్రాలు, రత్నాలపై పావు శాతం, బంగారంపై 3 శాతం జీఎస్టీ ఉన్నది. 2017 జూలై 1న జీఎస్టీని దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. వివిధ కేంద్ర, రాష్ట్ర పన్నులను కలిపి ఒకే దేశం, ఒకే పన్ను లక్ష్యంతో జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం పరిచయం చేసింది. ఇందుకుగాను ఆదాయాన్ని నష్టపోతున్న రాష్ర్టాలకు పన్ను వసూళ్లలో వాటాలనూ ఇస్తున్నది.