GST collections | 2021తో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్ల మార్కు కంటే తక్కువగా వసూలయ్యాయి. గత నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.41 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. అయితే, 2021 మే కంటే గత నెలలో 44 శాతం ఎక్కువ పన్ను వసూళ్లు నమోదు కావడం గమనార్హం. గత ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1.68 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఏప్రిల్ నెలలో తొలిసారి జీఎస్టీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటాయి. ఏప్రిల్ కంటే మే నెలలో జీఎస్టీ వసూళ్లు ఎల్లవేళలా తక్కువగానే ఉంటాయని కేంద్ర ఆర్థికశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
గత నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.41 లక్షల కోట్ల మార్కును దాటడం ప్రోత్సాహకరంగానే ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఏప్రిల్లో ఈ-వే బిల్లులు 74 మిలియన్లు రిజిస్టర్డ్ కాగా, మార్చిలో కంటే నాలుగు శాతం తక్కువ. గత మార్చిలో 77 మిలియన్ల ఈ-వే బిల్లులు జనరేట్ అయ్యాయి. మార్చి నుంచి జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లు దాటడం వరుసగా మూడో నెల.. జీఎస్టీ వసూళ్లు ప్రారంభించిన తర్వాత నాలుగోసారి అని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
గత నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.41 లక్షల కోట్లు. సెంట్రల్ జీఎస్టీ రూ.25,036 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ రూ.32,001 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.73.345 కోట్లు (వస్తువుల దిగుమతిపై సుంకాలు రూ.37,469 కోట్లు)- సెస్ రూ.10,502 కోట్లు (దిగుమతి వస్తువులపై సుంకాలు రూ.931 కోట్లు) అని ఆర్థికశాఖ వివరించింది.