GST | న్యూఢిల్లీ, జనవరి 1:వస్తు, సేవల పన్ను వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన సంవత్సరం చివరి నెలలో రూ.1.77 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. దీంట్లో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.32,836 కోట్లు వసూలవగా, స్టేట్ జీఎస్టీ కింద రూ.40,499 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ. 47,783 కోట్లు, సెస్ రూపంలో రూ.11, 471 కోట్లు వసూలయ్యాయి. అలాగే రూ.22,490 కోట్లు రిఫండ్ రూపంలో చెల్లింపులు జరిపింది.
మొత్తంగా డిసెంబర్లో రూ.1.77 లక్షల కోట్లు వసూలైనట్లు, క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.65 లక్షల కోట్లతో పోలిస్తే 7.3 శాతం అధికమని పేర్కొంది. దీంట్లో దేశీయంగా జరిపే లావాదేవీలపై విధించిన జీఎస్టీతో రూ.1.32 లక్షల కోట్లు సమకూరగా, దిగుమతి చేసుకునే వస్తువులపై విధిస్తున్న పన్నులతో మరో రూ.44,268 కోట్లు సమకూరాయి. నవంబర్ నెలలో రూ.1.82 లక్షల కోట్ల పన్ను వసూలైంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ 2024లో అత్యధికంగా రూ.2.10 లక్షల కోట్లు వసూలయ్యాయి.