GST Collection | దేశీయంగా జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. నవంబర్ నెలలో రూ.1.82 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు రికార్డయ్యాయి. గతేడాది నవంబర్ నెలలో రూ.1.68 లక్షల కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది 8.5 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు తొమ్మిది శాతం పెరిగి రూ.1.87 లక్షల కోట్లు నమోదు కాగా, ఈ ఏడాది అత్యధికంగా ఏప్రిల్ లో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ఏప్రిల్ తర్వాత గరిష్టంగా జీఎస్టీ వసూలు కావడం నవంబర్ నెలలోనే ఫస్ట్ టైం.
గత నెలలో వసూలైన రూ.1.82 లక్షల కోట్లలో సీజీఎస్టీ రూ.34,141 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.42,047 కోట్లు, ఐజీఎస్టీ రూ.91,828 కోట్లు ఉన్నాయి. సెస్ ల రూపేణా రూ.13,253 కోట్ల వసూళ్లు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఫెస్టివ్ సీజన్ కారణంగా గత నెలలో దేశీయ లావాదేవీలు 9.4 శాతం పెరిగి రూ.1.40 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. దిగుమతుల ద్వారా పన్ను వసూళ్లు ఆరు శాతం పెరిగి రూ.42,591 కోట్లకు చేరాయి. గతేడాదితో పోలిస్తే నవంబర్ లో రీఫండ్స్ 8.9 శాతం తగ్గి రూ.19,259 కోట్లకు పరిమితం అయ్యాయి. గతేడాది ఏప్రిల్ – నవంబర్ మధ్య కాలంలో రూ.11.81 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు కాగా, ఈ ఏడాది రూ.12.90 లక్షల కోట్లకు పెరిగింది.