Auto Sales | యావత్ దేశం దీపావళి పండుగకు సిద్ధమైంది. ఈ క్రమంలో వాహన మార్కెట్‌కు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. పండుగ సీజన్లో పెద్ద సంఖ్యలో జనం కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో గ్రాంట్ థార్న్టన్ ఇండియా నిర్వహించిన ఓ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 2800 మంది అభిప్రాయాలు సేకరించింది. సర్వే ప్రకారం.. మారుతున్న జీవనశైలి, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, జీఎస్టీ 2.0 వంటి ప్రభుత్వ సంస్కరణలు మార్కెట్‌కు బూస్ట్ ఇచ్చాయని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 41శాతం మంది రాబోయే మూడునాలుగు నెలల్లో కొత్తగా కారును కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లుగా చెప్పారు.
72శాతం మంది జీఎస్టీలో మార్పుల నేపథ్యంలో కార్ల కొనుగోలును వాయిదా వేసినట్లు చెప్పారు. గ్రాంట్ థోర్న్టన్ విశ్లేషకుడు సాకేత్ మెహ్రా మాట్లాడుతూ.. ఈ పండగు సీజన్లో అమ్మకాలకు అవకాశం మాత్రమే కాదని.. వినియోగదారుల ప్రవర్తనలో మార్పులను ప్రతిబింబిస్తుందన్నారు. వాహనాల కొనుగోలుదారులు భద్రతతో పాటు ప్రీమియం ఫీచర్స్ కోసం అదనంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జీఎస్టీ సంస్కరణలతో వాహనాల ధరలు తగ్గాయని, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలు కార్లను కొనుగోలు చేసే విధానాన్ని పూర్తిగా మార్చివేశాయన్నారు. 38 శాతం మంది వినియోగదారులు హైబ్రిడ్ కార్లను ఇష్టపడుతున్నారని, పెట్రోల్ కార్లు 30 శాతం మంది, ఎలక్ట్రిక్ కార్లకు 21శాతం మంది ప్రాధాన్యం ఇచ్చినట్లుగా సర్వే తెలిపింది.
భారత్‌లో యూఎస్వీల ఆధిపత్యం కొనసాగిస్తుందని.. 64శాతం మంది యూఎస్వీలను కొనుగోలు చేయనున్నట్లుగా సర్వేలో చెప్పారు. మార్కెట్లో ఎస్‌యూవీల వాటా 65శాతం ఉంది. ఇది రెండేళ్ల కిందట దాదాపు 50శాతం మాత్రమే ఉంది. 34శాతం మంది కొనుగోలుదారులు భద్రతే అత్యంత ప్రాధాన్యం అంశమని పేర్కొన్నారు. కఠినమైన భద్రతా నిబంధనలు, క్రాష్ టెస్ట్‌పై అవగాహన, అధునాతన సెక్యూరిటీ ఫీచర్స్‌తో కూడిన కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా పేర్కొన్నారు. 35 శాతం కంటే ఎక్కువ మంది హై-ఎండ్ వేరియంట్లకు ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని సర్వే తెలిపింది. కార్లను కొనుగోలు చేసే ముందు షోరూమ్‌లతో పాటు ఆన్లైన్లో విస్తృతంగా తెలుసుకుంటున్నారని సర్వే తెలిపింది.
52 శాతం మంది ఆన్లైన్, ఆఫ్‌లైన్ నుంచి.. 35 శాతం మంది సోషల్ మీడియా, 23 శాతం మంది కార్ యాప్‌ల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లు చెప్పారు. దీని అర్థం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కారు కొనుగోలులో తొలి అడుగుగా మారాయని సర్వే అభిప్రాయం వ్యక్తం చేసింది. మార్కెట్‌పై జీఎస్టీ రేట్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్న కార్లపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ తగ్గించిన విషయం తెలిసిందే. దాంతో కారు ధరలో దాదాపు రూ.లక్ష వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావం టైర్-2, టైర్-3 నగరాల్లో ఎక్కువగా కనిపిస్తున్నది. ఇక్కడ గతంలో కంటే ఎక్కువ మంది కొత్త కార్ల కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారు. గత నవరాత్రి సీజన్లో వాహనాల రిటైల్ అమ్మకాలు 34శాతం పెరిగిన విషయం తెలిసిందే. ఈ సారి మరింత అమ్మకాలు పెరగవచ్చని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.