Industrial Growth Rate | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: దేశంలో పారిశ్రామిక ప్రగతి పాతాళానికి దిగజారింది. కీలక రంగాల్లో నిస్తేజం ఆవరించింది మరి. ఆగస్టులో మూడున్నరేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ -1.8 శాతానికి వృద్ధిరేటు పతనం కావడం ప్రమాద ఘంటికల్నే మోగిస్తున్నదిప్పుడు. 2021 ఫిబ్రవరిలో -3.3 శాతంగా నమోదైంది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే నెగెటివ్ జోన్లోకి కోర్ సెక్టార్స్ పడిపోవడం గమనార్హం. ఎరువులు, ఉక్కు రంగాలు మినహా బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్, విద్యుత్తు రంగాల్లో ఉత్పాదకత క్షీణించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల్లో తేలింది. నిజానికి ఈ ఏడాది జూలైలో 6.1 శాతం వృద్ధిరేటు కనిపించింది. ఇక గత ఏడాది ఆగస్టులో ఏకంగా 13.4 శాతం వృద్ధి నమోదైంది. కానీ ఏడాది వ్యవధిలో అంతా తారుమారైపోయింది.
భారతీయ పారిశ్రామిక రంగ ముఖచిత్రాన్ని ప్రతిబింబించే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎరువులు, ఉక్కు, బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్, విద్యుత్తు రంగాల వాటానే 40.27 శాతంగా ఉన్నది. అయితే ఈ 8 కీలక రంగాల్లో ఇప్పుడు 6 రంగాలు నిరాశాజనకంగా కనిపిస్తున్నాయి. గతంతో పోల్చితే ఈ రంగాల్లో తయారీ దారుణంగా పడిపోయింది. మిగతా 2 రంగాల్లోనూ ఎరువుల తయారీ ఒక్కటే ఆకట్టుకునే స్థాయిలో ప్రదర్శననిచ్చింది. 1.8 శాతం నుంచి 3.2 శాతానికి వృద్ధి చెందింది. అయితే ఉక్కు పరిశ్రమల్లోనూ మందగమన ఛాయలు కనిపిస్తున్నాయి. నిరుడు ఆగస్టులో ఈ రంగం ఉత్పాదకత రేటు 16.4 శాతంగా ఉన్నది. కానీ ఈ ఏడాది ఆగస్టులో ఇది 4.5 శాతానికి దిగజారడం పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతున్నది. దీంతో మొత్తం ఐఐపీనే ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాబోయే నెలల్లో ఐఐపీ గణాంకాలు పడిపోవచ్చన్న అంచనాలు ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనాల ప్రకారం ఆగస్టులో ఐఐపీ గణాంకాలు 1 శాతానికి పడిపోవచ్చు. జూలైలో ఇది 4.8 శాతంగా ఉన్నది. ఇక సెప్టెంబర్లోనూ కీలక రంగాల ప్రదర్శన అసంతృప్తిగానే ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం మొదలు కీలక రంగాల పనితీరు అంతంతమాత్రంగానే సాగుతున్నది. ఏప్రిల్-ఆగస్టు మధ్య 8 కీలక రంగాల వృద్ధిరేటు 2023-24 ఇదే వ్యవధితో పోల్చితే 8 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది. పరిస్థితులు ఇకపైనా ఇలాగే ఉంటే దేశ జీడీపీ అంచనాలను అవి పెద్ద ఎత్తునే ప్రభావితం చేయవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆర్బీఐ ఇకనైనా వడ్డీరేట్లను తగ్గించాలని అటు ఇండస్ట్రీ, ఇటు మార్కెట్ వర్గాలూ డిమాండ్ చేస్తున్నాయి.